హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): మైన్స్, మినరల్స్ చట్ట సవరణ బిల్లును 2011 డిసెంబర్ 12న మొదట ప్రవేశ పెట్టింది మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారేనని, ఆ బిల్లు స్టాడింగ్ కమిటీకి వెళ్లి, అక్కడ చర్చించిన తర్వాత లోక్‌సభకు వచ్చిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ చెప్పారు. అప్పటికే లోక్‌సభ సమయం ముగియడం, ఎన్నికలు రావడంతో బిల్లు రద్దయిందని, యూపీఏ హయాంలో స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు తెచ్చిన బిల్లునే బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో 2015 జనవరి 12న తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మూజువాణి ఓటుతోనే బిల్లు ఆమోదం పొందిందని, ఈ బిల్లును ఒకసారి భట్టి చదువుకోవాలని సూచించారు. ఆ బిల్లుకు బీఆర్ఎస్ ఎంపీలు మద్దతిచ్చారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు.
శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావుతో కలిసి వినోద్‌కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ ఎంపీల నిరసనల మధ్యే మూజువాణి ఓటుతో మినరల్ బిల్లు పాస్ అయిందనే కనీస పరిజ్ఞానం కాంగ్రెస్‌కు లేకపోవడం దురదృష్టకరమని మండిపడ్డారు. భట్టి బేషరతుగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డి కలిసి సింగరేణిని అమ్ముతున్నారని విమర్శించారు. సెక్షన్ 17ఏ కింద బొగ్గు బ్లాక్‌లను సింగరేణికి రిజర్వ్ చేసే అవకాశమున్నదని, గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణిపై కేంద్రానికి రాసిన లేఖనే ఇప్పుడు రేవంత్ ప్రామాణికంగా తీసుకోవాలని సూచించారు. కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి తక్షణమే ఢిల్లీ వెళ్లి మోదీని కలిసి సింగరేణి, సింగరేణి కార్మికుల జీవితాలను బతికించాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణిలో వందేండ్లకు సరిపడా బొగ్గు నిల్వలున్నాయని, వాటిని తెలంగాణ అభివృద్ధి కోసం వినియోగించాలని కోరారు. సింగరేణి ని చంపేందుకే బీజేపీ నుంచి ఎనిమిది ఎంపీ లు గెలిచారా? అంటూ వినోద్‌కుమార్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబుతో మాట్లాడైనా ఎన్డీయే ప్రభుత్వంలో సింగరేణికి బొగ్గు గనులు దక్కేవిధంగా చేయాలన్నారు. మోదీతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సింగరేణి బ్లాక్‌ల వేలాన్ని వాయిదా వేశారు తప్ప, సింగరేణికి కేటాయించలేదని తెలిపారు.
నిజాం కాలం నుంచే హక్కులు
రాష్ట్రంలో బొగ్గు గనుల అన్వేషణ, తవ్వకాల కోసం సింగరేణికి నిజాం ప్రభుత్వం ప్రత్యేక హకులు ఇచ్చిందని, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ (ఎంఎండీఆర్) చట్టం, 1957 సవరణకు ముందు, ఆ తర్వాత 2015 వరకు సింగరేణికి పూర్తి హకులు ఉన్నాయన్నారు. సింగరేణి, తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాల మధ్య త్రైపాక్షిక ఒప్పందానికి అనుగుణంగా మైనింగ్ ప్రణాళికలు ఆమోదించారని చెప్పారు. సవరించిన ఎంఎండీడీఆర్ చట్టం-2015 నింబంధనల ప్రకారం బొగ్గు బేరింగ్ ప్రాంతాలను ప్రభుత్వ (బొగ్గు గనుల) కంపెనీకి కేటాయించవచ్చన్నారు. కేంద్ర సరారు వేలం వేయాలని భావిస్తున్న తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించవచ్చన్నా రు. సెక్షన్ 11ఏ(1) ప్రకారం పోటీ బిడ్డింగ్ ద్వారా వేలంలో కేటాయించవచ్చని, లేదా సెక్షన్ 11(ఏ)(3)(ఏ) కింద, ఎంఎండీఆర్లోని సెక్షన్ 17(ఏ) (2ఏ) కింద రిజర్వేషన్లో కేటాయించవచ్చన్నారు. సత్తుపల్లి బ్లాక్-3, కోయగూడెం ఓసీ-3, శ్రావణపల్లి ఓసీ, కల్యాణి ఖని నం.6 ఇంకె్లైన్ (యూజీ) అనే నాలుగు బొగ్గు బేరింగ్ ప్రాంతాల కేటాయింపు కోసం సింగరేణి గతంలోనే కేంద్రాన్ని సంప్రదించిందని వినోద్‌కుమార్ వివరించారు.
చట్టంలోనే వెసులుబాటు
చట్టంలోని మూడు సెక్షన్ల ఆధారంగా తెలంగాణలోని నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికి కేటాయించవచ్చునని, కానీ కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వశాఖ బహిరంగ వేలం వేయాలని నిర్ణయించిందని వినోద్‌కుమార్ తెలిపారు. ఈ నిర్ణయం సింగరేణి మనుగడ, కార్మికుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. జాతీయ బొగ్గు నిల్వల్లో ఆరు శాతం వాటా కలిగిఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) దేశ బొగ్గు ఉత్పత్తిలో సుమారు 8శాతం చేస్తుందన్నారు. సింగరేణి ఏడేండ్ల నుంచి పనితీరును స్థిరంగా మెరుగుపర్చుకుంటోందని, నిరుడు 65 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి స్థాయికి చేరుకుందని, ఈ ఏడాది 68 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయాలని భావిస్తోందని చెప్పారు. గోదావరి వ్యాలీ కోల్ ఫీల్డ్స్ (జీవీసీఎఫ్)లో బొగ్గు ఉత్పత్తి అనేక అవాంతరాలతో కూడుకున్నదని, ఎకువ లోతు, నాణ్యతలేని కారణంగా సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఓపెన్ కాస్ట్ మైనింగ్‌కు అనువుగా ఉండే బొగ్గు నిల్వల కోసం కంపెనీ కష్టడుతున్నదని చెప్పారు.
కేటాయింపుపై సీఎంపీడీఐఎల్ సిఫారసు
ఈ నాలుగు బ్లాకులను సింగరేణికికి కే టాయిస్తే, దాదాపు 12 మిలియన్ టన్నుల థర్మల్ బొగ్గును దిగుమతి చేసుకోవడం, విద్యుత్ రంగానికి బొగ్గు సరఫరా పెంచ డం సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు గను ల మంత్రిత్వశాఖ కూడా గతంలో తెలిపిందని చెప్పారు. వివరాల పరిశీలన తర్వాత సింగరేణికి ఈ బ్లాకులను కేటాయించాలని కేంద్ర గనుల ప్రణాళిక నిర్వహణ సంస్థ (సీఎంపీడీఐఎల్) సిఫార్సు చేసిందని తెలిపారు. ఇప్పటికే నిర్వహిస్తున్న గనులకు కొనసాగింపుగా విస్తరణ ప్రాంతాల్లో మైనింగ్, నిల్వల పరిరక్షణ సాంకేతికంగా మరింత సాధ్యపడుతుందన్నారు.