హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): లాఠీచార్జీలతో దళితబంధు లబ్ధిదారుల పోరాటాన్ని ఆపలేరని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ తేల్చిచెప్పారు. దళితబంధు నిధులు విడుదల చేయాలని ఆందోళన చేస్తున్న దళితులు, హుజూరాబాద్ ఎమ్మెల్యేపై పోలీసులు దాడి చేయడం అమానుషమని ఖండించారు. పోలీసు యంత్రాంగం సీఎం రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో పనిచేస్తూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై లాఠీలు ఝులిపించడం దుర్మార్గమని మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్గౌడ్తో కలిసి విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ దళితుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు తెచ్చిన దళితబంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నదని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ సర్కారు హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి 5000 మంది దళితుల ఖాతాల్లో నగదును జమచేసిందని గుర్తుచేశారు. ఎన్నికల కోడ్ రావడంతో విడుదల చేయలేకపోయిందని చెప్పారు. ఏడాది క్రితం గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కారు కేసీఆర్‌ను బద్నాం చేసేందుకు దళితబంధు లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేసిందని ఆరోపించారు. ఎన్నికల ముందు దళితబంధు కింద రూ. 12లక్షలు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి, ఇప్పుడు లబ్ధిదారుల ఖాతాలను స్తంభింపజేయించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. దళితులతో కలిసి ధర్నాలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు విచక్షణ రహితంగా దాడులు చేసి గాయపరచడం దుర్మార్గమని మండిపడ్డారు.