హైదరాబాద్, ఆగస్టు 27(నమస్తే తెలంగాణ) : చేయని తప్పుకి ఐదు నెలలపాటు ఎమ్మెల్సీ కవితను నిర్బంధించారని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆలస్యంగానైనా బెయిల్ రావడం సంతోషకరమని వ్యాఖ్యానించారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కవితపై పెట్టిన కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, కేసులో బీజేపీ వ్యతిరేక వ్యక్తులు లేకుంటే 15రోజుల్లో బెయిల్ వచ్చేదని తాను ఒక న్యాయవాదిగా చెబుతున్నానని స్పష్టంచేశారు. బీజేపీ వ్యతిరేక పార్టీల నాయకులు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం చేసిన లిక్కర్ పాలసీపై కేసు పెట్టారని, పైగా సౌత్ గ్రూప్ అని పేరుపెట్టి అహంకారంతో వ్యవహరించారని తెలిపారు. చిన్న కారణంతో తీవ్రమైన ఎండకాలంలో ఐదు నెలలు జైలులో ఉంచడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కేసులో రూపాయి కూడా రికవరీ చేయలేదని, ఎవరో చెప్పిన దానికి కవితను అక్యూజ్డ్ చేశారని చెప్పారు. అయ్యా.. బాంచెన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేదని, కానీ తలవంచకుండా గట్టిగా నిల్చొ ని పోరాడాము కాబట్టే ఇంతకాలం జైలులో ఉంచారని వినోద్ పేర్కొన్నారు.
కేసీఆర్‌ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేకనే కవితపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఆమెపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు తుల ఉమ, రజినీ సాయిచంద్, లలితారెడ్డి విమర్శించారు. ఈ కేసు నుంచి కడిగిన ముత్యం లా బయటకు వస్తారని పేర్కొన్నారు. లొంగని వాళ్లపై సీబీఐ, ఈడీలను బీజేపీ ప్రయోగిస్తున్నదని, కవిత విషయంలోనూ ఇదే జరిగిందని చెప్పారు. బెయిల్‌పై కాంగ్రెస్, బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదన్నారు.
కవితపై మోపిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ఈ కేసు పూర్తిగా కల్పితమని, ఇది ఢిల్లీ ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ భరత్ పేర్కొన్నారు. కేసీఆర్‌పై కక్ష సాధించేందుకే కవితను జైల్లో పెట్టారని తెలిపారు. తప్పుడు సాక్షాలు, తప్పుడు మాటలతో కవితను 6 నెలలు అష్టకష్టాలు పెట్టారని, ఛండాలమైన ఆరోపణలు చేశారని, దుర్మార్గంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తంచేశారు. బండి సంజయ్‌తోపాటు కాంగ్రెస్ నేతలు కోర్టుపై కూడా ఆక్షేపణలు చేస్తున్నారని, కోర్టు తీర్పును అవమానపరిచేలా మాట్లాడితే కంటెమ్ట్ ఆఫ్ కోర్టు పిటిషన్ వేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవితపై నమోదైన కేసు రాజకీయ ప్రేరేపిత కుట్ర అని సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో తేలిపోయిందని ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ మనోనిబ్బరాన్ని దెబ్బతీయడం కోసం బీజేపీ ఆడిన డ్రామాలో నమోదైన కేసుగా అభివర్ణించారు.
సుప్రీం కోర్టు బెయిల్‌తో ఒక్కసారిగా రాజకీయ కుట్రలన్నీ పటాపంచలయ్యాయని బీఆర్ఎస్ నేత, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ చెప్పారు. ఇది బీజేపీ ఆడిన రాజకీయ డ్రామా అని అభివర్ణించారు.
ఎమ్మెల్సీ కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం చూపలేకపోయినందు నే బెయిల్ మంజూరైందని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. ఆఖరికి న్యాయం గెలిచిందని తెలిపారు.