హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ప్రకృతి పరిరక్షణలో పాఠశాల, కాలేజీ విద్యార్థులను గేమ్ చేంజర్లుగా తీర్చిదిద్దాలని గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణహిత సుస్థిర అభివృద్ధిలో విద్యార్థులను మరింతగా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. ఢిల్లీలో శుక్రవారం ‘సుస్థిర పర్యావరణం- విద్యార్థుల పాత్ర’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ఢిల్లీ ఇండియా హాబిటాట్ సెంటర్లో (రెండురోజుల ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టెయినబిలిటీ ఎడ్యుకేషన్-ఐసీఎస్ఈ) యునెసో పర్యావరణ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి పర్యావరణ నిపుణులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులతోపాటు కేంద్ర అడవులు, పర్యావరణ శాఖ మాజీ సెక్రటరీ ప్రవీణ్ గారె, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పద్మశ్రీ కార్తికేయ సారాభాయ్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పాయెంగ్, వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ రాజేంద్రసింగ్ పాల్గొని ప్రసంగించారు. అడవులను కాపాడటం, నీటి వనరుల రక్షణ ప్రస్తుతం సమాజం ముందున్న అతిపెద్ద సవాల్ అని వక్తలు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విషయాలపై తగిన అవగాహన కల్పించేలా క్షేత్రస్థాయి పర్యటనతో కూడిన బోధనా విద్య ఉండాలని సూచించారు. పర్యావరణ విద్యలో క్షేత్రస్థాయిలో పరిశీలన, విద్యార్థులకు అవగాహన కూడా అత్యంత ముఖ్యమైన విషయమని అభిప్రాయపడ్డారు.
విద్యార్థులకు అవార్డులు అందజేసిన సంతోష్
గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా దేశవ్యాప్తంగా చేపడుతున్న కార్యక్రమాలను మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ వివరించారు. ప్రకృతి పునరుద్ధరణలో భాగంగా పెద్దఎత్తున మొకలు నాటడం, సమాజంలో ప్రభావిత వ్యక్తులను భాగస్వాములను చేయడం లాంటి కార్యక్రమాలను గత ఏడేండ్లుగా చేపడుతున్నట్టు వెల్లడించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ స్ఫూర్తిని సమావేశంలో పాల్గొన్న వక్తలు అభినందించారు. వివిధ సూళ్లలో విద్యనభ్యసిస్తూ పర్యావరణ పరిరక్షణపరంగా ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులకు సంతోష్‌కుమార్ చేతులమీదుగా నిర్వాహకులు అవార్డులను అందజేశారు. రానున్న రోజుల్లో పర్యావరణపరంగా మానవాళికి పొంచి ఉన్న ముప్పును ఇప్పటినుంచే విద్యార్థులకు తెలియజేసి, ప్రకృతి పట్ల తగిన బాధ్యతతో ప్రవర్తించాల్సిన తీరును వారికి నేర్పాల్సిన అవసరం ఉన్నదని ైక్లెమేట్ రియాలిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ (ఇండియా, సౌత్ ఆసియా) డాక్టర్ ఆదిత్య పండిట్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పర్యావరణ మార్పులు తద్వారా ఎదురోబోయే సమస్యల పట్ల విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కలిగించేలా సిలబస్‌లో మార్పులతోపాటు తరగతి గదుల్లో కూడా ఆ విధమైన విద్య అభ్యసించేలా ఉండాలని అందుకు తగిన మార్పుచేర్పులను కేంద్రం చేపట్టాలని నిపుణులు సూచించారు. పర్యావరణ మార్పులు, గ్లోబల్ వార్మింగ్‌పై అధ్యయనం చేస్తున్న వివిధ దేశాల శాస్త్రవేత్తలు, పర్యావరణ నిపుణులు ప్యానెల్ చర్చల్లో పాల్గొని తమ అనుభవాలను పంచుకున్నారు. కార్యక్రమంలో రీతురాజ్ పుకాన్, గ్రీన్ ఇండియా చాలెంజ్ సమన్వయకర్తలు కరుణాకర్‌రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
అరావళిలో మొక్కనాటిన సంతోష్‌కుమార్
ఢిల్లీలోని వసంత్‌విహార్ సమీపంలోని అరావళి ఫారెస్టును మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా చాలెంజ్ ఫౌండర్ సంతోష్‌కుమార్ శుక్రవారం సందర్శించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా అక్కడ అరావళి టీం సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. 2004కు పూర్వం అరావళి ఫారెస్ట్ అంతటా డంపింగ్ యార్డ్, మైనింగ్ జరుగుతూ ఉండేది. మైనింగ్ నుంచి రక్షించాలని స్థానిక ప్రజలు కోర్టుకు వెళ్లడంతో ఫారెస్ట్‌ను రక్షించాలని కోర్టు ఆదేశించింది. దాంతో ఢిల్లీ సరార్ పార్ అభివృద్ధికి రూ.200 కోట్లు కేటాయించింది. ప్రొఫెసర్లు హుస్సేన్, దిశాంత్, అరావళి టీం 700 ఎకరాల్లో అడవిని సంరక్షించి, సుందరంగా తయారుచేశారు. ఈ అడవిలో ప్రస్తుతం 150 రకాల సీతాకోకచిలకల జాతులు, 120 రకాల పక్షులు కనువిందు చేస్తున్నాయి. ఇక్కడి గుంతలను ఇంకుడు గుంతలుగా మార్చడంతో భూగర్భ జలాలు సైతం పెరిగాయి.
పర్యవరణ ఉద్యమంలో భాగమవడం గర్వంగా ఉన్నది: సంతోష్
యునెస్కో సదస్సులో భారతదేశపు ప్రముఖ పర్యావరణ పరిరక్షకులు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్, ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా పద్మశ్రీ జాదవ్ పాయెంగ్‌తో కలిసి వేదిక పంచుకోవడం గర్వంగా ఉన్నదని మాజీ ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పర్యావరణాన్ని పెంపొందించడంలో, స్థిరత్వం కోసం విద్యను ప్రోత్సహించే యంగ్ ఇన్నోవేటర్స్ నడిపించే అద్భుతమైన ఎకో-ప్రాజెక్టులను ప్రత్యక్షంగా చూడటం గొప్ప అనుభూతి కలిగించిందని పేర్కొన్నారు. మనందరి భవిష్యత్‌ను పచ్చగా, ప్రకాశవంతంగా మారుస్తున్న ఈ ఉద్యమంలో భాగమవడం మరింత గర్వంగా ఉన్నదని ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తంచేశారు.