హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. రాష్ర్టానికి చెందిన మాజీ ఎంపీ సంగ్రామ్‌సింగ్ జైసింగ్రావు గైక్వాడ్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో శనివారం పార్టీ కండువా కప్పుకొన్నారు. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, మరాఠా ధన్కర్ సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత బాలాసాహెబ్ కన్నంవార్ కూడా కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరితోపాటు ఉస్మానాబాద్ జిల్లా నుంచి పలువులు ముఖ్య నేతలు కూడా గులాబీ పార్టీ గూటికి చేరారు. వీరందరికి కేసీఆర్ పార్టీ గులాబీ కండువా ఆహ్వానించారు.
బీఆర్ఎస్లో చేరినవారిలో కిసాన్ ఉద్యమ నేత కిషన్ హరిశ్చంద్ర కశిద్, శివసేన నాయకుడు ప్రాగ్శామ్రావ్ పాటిల్, పుండలీక్ కృష్ణాజీ జాదవ్, నితా శ్యామ్‌రావ్ గైక్వాడ్, ఆర్ఎస్పీ నేత ఓకార్ నాన్సో నికమ్, కాంగ్రెస్ నాయకుడు విశ్వజిత్ షిండే, ప్రొఫెసర్ శరద్ కాంబ్లే , మహిళా నేత స్వప్నమాలి, ఆర్ఎస్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాణిక్ పోలా, యువనేత సచిన్ అంబోర్, కార్మిక నేత సలీం భైవా సయ్యద్, ఛత్రపతి సేన రాష్ట్ర అధ్యక్షుడు రోహిత్ బాహూ మాల్మే, ఆర్ఎస్పీ సాంగ్లీ జిల్లా అధ్యక్షుడు ఆకాశ్ పడోలే, వివేక్ పాటిల్ తదితరులున్నారు. కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్‌రావు, స్టీరింగ్ కమిటీ సభ్యుడు శంకరన్న ధోండ్గే, పుణె డివిజన్ కోఆర్డినేటర్ బిజె దేశ్ ముఖ్ తదితరులు పాల్గొన్నారు.