B.Vinodkumar | హైదరాబాద్, ఆగస్టు 10(నమస్తే తెలంగాణ): కేంద్రం కొత్తగా మంజూరు చేసిన పాండురంగాపురం-మల్కాన్‌గిరి కొత్త రైల్వేలైన్ బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ అవసరాలు తీర్చేలా ఉన్నదని, కేంద్రం ఇప్పటికైనా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం తెలంగాణ బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ డిమాండ్‌చేశారు. బయ్యారం ఉక్కుఫ్యాక్టరీకి అవసరమైన ఐరన్‌ఓర్‌ను తరలించేందుకు ఈ రైల్వేలైన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం కొత్త రైల్వేలైన్, ఐరన్‌ఓర్‌ను గుజరాత్‌కు తరలించే ఆలోచన చేయడం తగదని సూచించారు. ఇక్కడ రైల్వేలైన్లకు అనుగుణంగా మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని కోరారు.
శనివారం ఆయన తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ ఖమ్మం నేత దిండిగల రాజేందర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. కేంద్ర క్యాబినెట్ శుక్రవారం 173 కిలోమీటర్ల పాండురంగాపురం (భద్రాచలం)-మలాన్గిరి రైల్వేలైన్‌కు అనుమతి ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది మంచి లైన్ అంటూ అభివర్ణించారు. ఈ రైల్వేలైన్‌ను తెలంగాణ ఓ కోణంలో వినియోగించుకోవాలని ఆలోచిస్తుంటే మోదీ మరోకోణంలో ఆలోచిస్తున్నారని తెలిపారు. ‘బయ్యారం ఉకు తెలంగాణ హకు’ అనే నినాదంతో ఉద్యమం కొనసాగిందని, విశాఖ కంటే బయ్యారానికే ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా దగ్గరవుతుందని, బయ్యారానికి రైల్వేలైన్ చాలా కీలకమైందని, ఎన్ఎండీసీ అధికారులు ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు రైల్వేలైన్ కావాలని అడిగారని, దీనిద్వారా ఫ్యాక్టరీకి ప్రధాన రవాణా సౌకర్యం కలుగుతుందని చెప్పారు.
2017లో కేంద్రం ఉకు పాలసీ ప్రకటించిందని, 2030 నాటికి తలసరి ఉకు వినియోగాన్ని ప్రతి వ్యక్తి 158 కిలోలు వాడే విధంగా ప్రోత్సహించాలని నిర్ణయించిందని గుర్తుచేశారు. బయ్యారంలో తెలంగాణ స్టీల్ ప్లాంట్ పెడితేనే తలసరి వినియోగ అవసరాలను తీర్చేలా ఉత్పత్తి జరుగుతుందని చెప్పారు. కొత్త రైల్వేలైన్ ఖనిజ సంపదను గుజరాత్ తరలించేందుకు ఉపయోగపడేదిగా మారకూడదని తెలిపారు. బయ్యారం లో మూడు మిలియన్ టన్నుల ఉకు ఉత్పాదక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని గతంలోనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిపాదించిందని, ఈ ఫ్యాక్టరీ వస్తే నాలుగు వేల మందికి ప్రత్యక్షంగా, పదివేల మందికి పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. పదేండ్లుగా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా తెలంగాణలో భారీ పరిశ్రమలకు మోదీ పది పైసలైనా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.