హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి చెప్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పేరుతో గురుకులాలను ఉంచుతున్నారా? ఊడగోడుతున్నారా? చెప్పాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ప్రశ్నించారు. రాష్ట్రంలో గురుకులాలను తగ్గిస్తున్నారా? కొత్త రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నారా? స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి ఒకటని చెప్తున్న సీఎం, ఇప్పుడున్న 1,023 గురుకులాలను 119 చేస్తారా? లేక అదనంగా 119 గురుకులాలను ఏర్పాటు చేస్తున్నారా? చెప్పాలని నిలదీశారు. జీవో, ముఖ్యమంత్రి మాటలు, డీపీఆర్ పరస్పర విరుద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఈ గందరగోళంలో గురుకులాలను కుదించే కుట్ర ఏమైనా జరుగుతున్నదా? అనే అనుమానం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గురుకులాలను కుదిస్తే సహించే ప్రసక్తే లేదని, విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. గురుకులాలతో కేసీఆర్‌కు మంచి పేరు వచ్చిందని, గురుకులాల్లో చదవిన పిల్లలకు ఐఐటీ, ఎయిమ్స్‌లో సీట్లు వచ్చాయని గుర్తుచేశారు. కేసీఆర్ పేరును తుడిచివేయడం ఎవరి తరం కాదని తేల్చిచెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నేతలు తుల ఉమ, గెల్లు శ్రీనివాస్ యాద వ్, పల్లె రవి కుమార్‌గౌడ్ పాల్గొన్నారు.