హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ) : నీట్ నిర్వహణలో కేంద్రం అట్టర్‌ఫ్లాప్ అయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. నీట్‌తో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని, అందులోంచి రాష్ట్రం బయటకు రావాలని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలని, మంచి న్యాయవాదితో రాష్ట్రం తరఫున వాదనలు వినిపించాలని సూచించారు. తెలంగాణభవన్‌లో సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారని, వారందర్నీ గందరగోళ పరిచేలా ప్రశ్నపత్రం లీక్ అయిందని, ఆదివారం నీట్ పీజీ పరీక్ష జరగాల్సి ఉంటే పది గంటల ముందు వాయిదా వేసినట్టు ప్రకటించారని చెప్పారు. విద్యార్థులు దుబాయ్ నుంచి కూడా పరీక్ష రాసేందుకు వచ్చారని, పరీక్ష కేంద్రం ఉన్న నగరాలకు వ్యయ ప్రయాసాలకోర్చి చేరుకున్నారని తెలిపారు. కేంద్రం చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్షను రద్దు చేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు నష్టపోయారని, ఆందోళన, ఒత్తిడికి లోనయ్యారని చెప్పారు.
నీట్ యూజీలో అవకతవకలు జరిగినప్పుడే పీజీ పరీక్షకూడా వాయిదా వేస్తే బాగుండేదన్నారు. ఎన్డీయే పాలిత రాష్ర్టాలన్నింటిలో నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని ఆరోపించారు. గుజరాత్, హర్యానా, బిహార్, మహారాష్ట్రలోనే పేపర్ లీక్ అయిందని, బిహార్‌లో పేపర్ లీక్ వెనక ఎన్డీయే నేత ఉన్నట్టు ఓ పత్రికలో వార్త కూడా వచ్చిందని చెప్పారు. గొర్రెల, బర్రెల కొనుగోలు కుంభకోణంలో ఈడీ విచారణ జరుపుతదని బీజేపీ ఎంపీ రఘునందన్ అన్నారని, మరి లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే నీట్ అవకతవకలపై ఈడీ దర్యాప్తు అకర్లేదా అని, దీనికి పీఎంఎల్ఏ యాక్ట్ ఎందుకు వర్తించడంలేదని ప్రశ్నించారు. చిన్న కేసులకే ఈడీని పంపే మోదీ, నీట్ అవకతవకలపై ఎందుకు రంగంలోకి దింపలేదని, సుపరిపాలన అంటే ఇదేనా? అని నిలదీశారు. గతంలో పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ అయిందని బండి సంజయ్ ఆరోపణలు చేశారని, కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలన్నారని, హైకోర్టుకు కూడా వెళ్లారని, మరి ఇప్పుడు కేంద్ర మంత్రి అయిన బండి నీట్ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. నీట్‌పై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో నీట్‌పై చర్చించాలని, ఎన్డీయేలో ఉన్న చంద్రబాబు కూడా నీట్‌పై స్పందించాలని డిమండ్ చేశారు. సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్రనేత వంటేరు ప్రతాప్‌రెడ్డి, నాయకులు సీ కల్యాణ్, పావనిగౌడ్ పాల్గొన్నారు.