హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ) : ‘కేసీఆర్, హరీశ్‌రావుతో నీకు పోలికా? ముఖ్యమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడు’ అంటూ రేవంత్‌రెడ్డిపై మాజీ ఎంపీ బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. హరీశ్‌రావుపై రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియా మాట్లాడారు. రుణమాఫీ మోసాన్ని పక్కదారి పట్టించేందుకే కేసీఆర్, హరీశ్‌రావుపై రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడారని మండిపడ్డారు. రైతు రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని, భరతం పడతామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి దావోస్, అమెరికా పర్యటనల్లో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 4వేల పింఛన్ ఇవ్వనందుకు, స్కూటీలు ఇవ్వనందుకు, రైతులను వంచించినందుకు, ఇచ్చిన హామీలను అమలు చేయనందుకు రేవంత్‌రెడ్డే నీళ్లలో దూకాలని దుయ్యబట్టారు.
అంబేద్కర్‌ను రేవంత్‌రెడ్డి అవమానిస్తున్నాడని, నెక్లెస్‌రోడ్డులోని అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం వద్ద వసతులు కల్పించకుండా వదిలేశారని విమర్శించారు. రేవంత్‌రెడ్డిది నడుమంత్రపు సిరి అని, జాక్పాట్లో సీఎం అయ్యారని, ఇదే ఆయనకు చివరి పదవి అని, భవిష్యత్తులో ఇక ఏ పదవీ వచ్చేది లేదని చెప్పారు. రేవంత్‌రెడ్డికి దమ్ము, చిత్తశుద్ధి ఉంటే పనితీరులో పోటీ పడాలని సూచించారు. బీఆర్ఎస్ ఏ పార్టీలో విలీనం కాదని, బలమైన పార్టీ అని, మరో 50 ఏండ్లు బలంగా ఉండేందుకు పార్టీ నాయకత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. త్వరలోనే బలమైన ప్రాంతీయ పార్టీలున్న రాష్ర్టాల్లో పర్యటించి అక్కడ అధ్యయనం చేస్తామని తెలిపారు. మీడియా సమావేశంలో శాట్స్ మాజీ చైర్మన్ అంజనేయగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు బాలు పాల్గొన్నారు.