హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఒక పార్టీ ఓడిపోతే ఆ పార్టీ సచ్చినట్టే అయితే, 26 రాష్ర్టాల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదేనని బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో సచ్చిందని, ప్రజలు ఆ పార్టీని ప్రజలు బొందపెట్టేశారని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. ‘దేశంలో కాంగ్రెస్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే అధికారంలో ఉన్నది. మిగిలిన 26 రాష్ర్టాల్లో అధికారంలో లేదు. అంటే 26 రాష్ర్టాల్లో కాంగ్రెస్ సచ్చినట్లేనా? అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణభవన్‌లో మీడియాతో కర్నె ప్రభాకర్ మాట్లాడుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని రేవంత్ అంటున్నారని మండి పడ్డారు. సోనియాగాంధీ రాష్ట్రం నుంచి పోటీచేస్తే ఏకగ్రీవం చేయాలని మాట్లాడుతున్న రేవంత్.. తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హుజూర్‌నగర్‌లో పోటీ చేస్తే ఆమెపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎందుకు పోటీ చేశారని ప్రశ్నించారు.