హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. ప్రస్తుతం ఆర్డినెన్స్ పేరుతో మరో మోసానికి తెరలేపిందని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తేల్చకుండా కాలయాపన చేస్తున్నదని విమర్శించారు. ఇప్పుడు ఆర్డినెన్స్ అంటున్న ప్రభుత్వం.. కులగణన పేరుతో ఆరునెలలపాటు కాలయాపన ఎందుకు చేసిందో చెప్పాలని నిలదీశారు. రాష్ట్ర సర్కార్.. బీసీ కమిషన్ పేరు చెప్పి కొంతకాలం, డెడికేటెడ్ కమిషన్ పేరుతో మరికొంతకాలం, ఢిల్లీకి బిల్లు పంపి ఇంకొంతకాలం సమయం గడిపిందని మండిపడ్డారు.
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై చిత్తశుద్ధిలేకే ఇలా చేస్తూ వస్తున్నదని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలు కాలయాపనకే రేవంత్ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్‌లు న్యాయస్థానాల ముందు నిలబడబోవని స్పష్టంచేశారు. ప్రభుత్వ అసంబద్ధ, గందరగోళ నిర్ణయాలతో తెలంగాణ బీసీ వర్గాలు నష్టపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఢిల్లీకి వెళ్లినపుడు కనీసం ఒక్కసారైనా బీసీ బిల్లు గురించి ప్రధానితో ఎందుకు చర్చించలేదని ప్రశ్నించారు. తన సీటును కాపాడుకునే ప్రయత్నం తప్ప, రేవంత్‌రెడ్డికి బీసీల సమస్యలు పరిష్కరించడంపై లేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి తన నిజాయితీని నిరూపించుకునేందుకు తక్షణమే 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.