హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్‌లో సీనియర్ నేతలను చులకన చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరిపై కొట్లాడుతున్నామో వారినే పక్కన కూ ర్చోబెట్టి తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ పార్టీ సమావేశంలో పాల్గొన డంపై ఆయన భగ్గుమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను పార్టీ సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని సొంత పార్టీ నేతలపైనే విరుచుకుపడ్డా రు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించి వచ్చి తమ పక్కన కూర్చుంటే ఎలా? అని ప్రశ్నించారు. సంజయ్‌ని వేదికపై కూర్చోబెట్టడాన్ని నిరసిస్తూ జీవన్‌రెడ్డి గాంధీభవన్ నుంచి వాకౌట్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గాంధీభవన్‌లో బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతల సన్నాహక సమావేశం నిర్వహించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఇన్చార్జి మంత్రి ఉత్తమ్, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశానికి సంజయ్‌కుమార్‌ను కూడా ఆహ్వానించడంపై జీవన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. కొద్దిరోజులుగా ఇద్దరి మధ్య మాటలయుద్ధం నడుస్తున్నది. పార్టీ అభ్యర్థులను ఖరారు చేయడానికి ఆయన ఎవ్వరని నిలదీశారు. సంజయ్ అక్రమాలపై దశాబ్దకాలంగా తాను పోరాటం చేస్తుంటే, అదే అదే వ్యక్తిని మీటింగ్‌లో కూర్చోబెట్టారని ఫైర్ అయ్యారు. ఫిరాయింపు ఎమ్మెల్యేను పక్కన కూర్చోబెట్టుకొని మున్సిపల్ ఎన్నికలకు ఎలా సమాయత్తం అవుతారని నిప్పులు చెరిగారు.
ఇది నా ఒక్కడి ఆవేదన కాదు. దశాబ్దాల పాటు కాంగ్రెస్ జెండా మోసిన లక్షలమంది కార్యకర్తల వేదన ఇది. ప్రజల్లో పార్టీని చులకన చేస్తున్నారు. ఇది తీవ్ర దురదృష్టకరం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను పక్కన పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నారు. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి.
– జీవన్‌రెడ్డి

కాంగ్రెస్‌లో ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని జీవన్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతుంటే.. రాష్ట్ర నేతలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహించారు. ఫిరాయింపు కేసు సుప్రీంకోర్టులో విచారణ ఉన్నదని, రేపోమాపో తీర్పు వెలువడే సమయంలో ఇలా వ్యవహరించడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమేనని కుండబద్దలు కొట్టారు. నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న తనకు పార్టీ విలువ కూడా ఇచ్చిందని చెప్పారు. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌లో కొనసాగుతున్న పరిస్థితులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మీటింగ్‌లో కూర్చోబెట్టారని, తాను దీనిని జీర్ణించుకోలేకపోయానని, అందుకే పీసీసీకి క్షమాపణలు చెప్పి బయటకు వచ్చానని వెల్లడించారు.