మహబూబ్‌నగర్, జనవరి 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అడిగినంత కమీషన్ కాంట్రాక్టర్ ఇవ్వనందుకు ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు ఈ నెల 6న పట్టపగలు హంగామా సృష్టించారు. మారణాయుధాలతో పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి కాంట్రాక్టర్‌కు వార్నింగ్ ఇచ్చారు. కమీషన్ ఇస్తరా.. చస్తరా? అంటూ బెదిరించడమే కాకుండా అక్కడున్న నిర్మాణ సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సిబ్బంది, కూలీలు బెదిరి పారిపోయారు. నాలుగురోజుల నుంచి పనులు నిలిపివేశారు. ఈ నెల 9న కోదండాపూర్ పోలీస్‌స్టేషన్‌లో కాంట్రాక్టర్ ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే, అతడి అనుచరుల నుంచి ప్రాణ హాని ఉన్నదని తెలిపారు. ఈ విషయంపై ఆరా నమస్తే తెలంగాణ ఆరాతీయగా ఫిర్యాదు అందలేదని, ఇది పెద్దవాళ్ల వ్యవహారమని, మీకేందుకని పోలీసులు చెప్తున్నారు.
కాంట్రాక్టర్ ఇచ్చిన ఫిర్యాదులో ఇలా
రోడ్డు విస్తరణలో భాగంగా వేముల గ్రామ సమీపంలో పనులు చేస్తుండగా జనవరి 6న ఎల్లం, జైపాల్‌రెడ్డి, పీటర్సన్, మరో నలుగురు కలిసి మారణాయుధాలతో వచ్చి పనులు నిలిపివేయించారని భ్రమర ఇన్ఫ్రా కంపెనీ ప్రతినిధి జగదీశ్‌ప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నారు. మరుసటి రోజు కూడా సిబ్బందిని, కూలీలను బెదిరించడంతోపాటు వాహనాలు, మిషన్లను ధ్వంసం చేశారని వివరించారు.
మాజీఎమ్మెల్యే, అనుచరులతో ప్రాణహాని
పదేపదే మారణాయుధాలతో వార్నింగ్ ఇవ్వడంతో భయపడిన కాంట్రాక్టర్ జగదీశ్‌ప్రసాద్ తనకు, తన సిబ్బందికి మాజీ ఎమ్మెల్యే ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉన్నదని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమకు మాజీ ఎమ్మెల్యేతోపాటు వారి అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని, తమ సామగ్రి, వాహనాలకు భద్రత కల్పించాలని కోరారు. వాహనాలు ధ్వంసమైనందుకు పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కింద కేసులు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు బెదిరించిన విషయాన్ని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ఫిర్యాదు చేసినట్టు కాంట్రాక్టర్ వెల్లడించారు.
ఫిర్యాదు అందలేదన్న పోలీసులు
జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న ఒక కాంట్రాక్టర్‌ను ఓ మాజీ ఎమ్మెల్యే అనుచరులు మారణాయుధాలతో బెదిరించి పనులు నిలిపివేసిన ఘటన జిల్లా అంతటా బహిరంగ రహస్యమే అయినప్పటికీ పోలీసు యంత్రాంగం మాత్రం అధికార పార్టీ నేతలకు వత్తాసు పలుకుతున్నదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసులు కాంట్రాక్టర్ చేసిన ఫిర్యాదునే మాయం చేయడం విస్మయం కలిగిస్తున్నది. ఈ జిల్లాలో పోలీసు ఉన్నతాధికారితో సహా వివిధ పోలీస్స్టేషన్లలో పనిచేస్తున్న వారందరికీ పోస్టింగ్ ఇప్పించడంలో సదరు మాజీ ఎమ్మెల్యే కీలకపాత్ర పోషించారని సమాచారం. దీంతో ఆయనపై ఏ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యనేతల నుంచి ఆదేశాలు రావడం వల్లనే కేసు నమోదు చేయకుండా, ఫిర్యాదు కాపీలను పోలీసులు మాయం చేశారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నమస్తే తెలంగాణలో వచ్చిన కథనంపై పోలీసు ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి.
సెటిల్మెంట్ చేసుకోవాలని బెదిరింపు
అలంపూర్ నియోజకవర్గంలో జాతీయ రహదారి విస్తరణ పనులు చేపడుతున్న ఓ కాంటాక్ట్ సంస్థను రాష్ట్ర ముఖ్యనేత సన్నిహితుడు, మాజీ ఎమ్మెల్యే రూ.8 కోట్ల కమీషన్ డిమాండ్ చేశారు. జనవరి 6న రోడ్డు పనులు జరుగుతున్న స్థలానికి సుమారు 11 గంటల సమయంలో TS33E6768 అనే నంబరు కారులో వచ్చిన ఆకెపోగు పీటర్సన్‌తోపాటు మరికొందరు ‘మా నేతతో మాట్లాడిన తర్వాతే పనులు చేపట్టాలి. పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. సెటిల్మెంట్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. అంతటితో ఆగకుండా పనులు జరుగుతున్న ప్రదేశంలో హంగామా సృష్టించి అక్కడ నిలిపి ఉన్న వాహనాలను ధ్వంసం చేశారు.