అశ్వారావుపేట, ఆగస్టు 18: మాజీ ఎంపీ, కాంగ్రెస్ ప్రచార కమిటీ కో-చైర్మన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒంటెత్తుపోకడలతో ఖమ్మం జిల్లా క్యాడర్లో గందరగోళం నెలకొన్నదని, అధిష్ఠానం మేల్కొని చర్యలు తీసుకోకుంటే రానున్న ఎన్నికల్లో ఆ పార్టీ పుట్టిమునగడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. పొంగులేటి మోసాన్ని గుర్తించి భద్రాచలం ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావు తిగిరి బీఆర్ఎస్లో చేరారని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్లో చేరే నాటికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని, పొంగులేటి కాంగ్రెస్లో చేరిన తర్వాత పరిస్థితులు చేజారిపోతున్నట్టు కనిపిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ టికెట్ ఆశించటంలో తప్పులేదని, కానీ జారే ఆదినారాయణ పార్టీ టికెట్ తనదేనని, ‘తాటికి’ టికెట్ రాదని ప్రచారం చేయడం సరికాదని చెప్పారు. తనకు టికెట్ రాదని చెప్పడానికి జారే ఎవరని తాటి ప్రశ్నించారు. పొంగులేటి ఆయన అనుచరులు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ను భ్రష్టు పట్టిస్తున్నారని తాటి ఆగ్రహించారు. ఇప్పటికైనా పార్టీ అధిష్ఠానం మేల్కొని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని, లేకుంటే రానున్న ఎన్నికల్లో నష్టం తప్పదని హితవు పలికారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు, జ్యేష్ట సత్యనారాయణ చౌదరి, బత్తిన పార్థసారధి తదితరులు పాల్గొన్నారు.