Sunke Ravi Shankar | కరీంనగర్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను చంపేస్తామంటూ.. బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. ఆయన కరీంనగర్ టుటౌన్ పోలీసుస్టేషన్లో ఉన్న సమయంలోనే బెదిరింపు కాల్ రావడం గమనా ర్హం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడతావా అంటూ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నల్ల సతీశ్‌పై గుర్తు తెలియన వ్యక్తులు దాడి చేశారు.
మంగళవారం జరిగిన ఈ రెండు ఘటనలపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చొప్పదండి నియోజకవర్గం బోయినపల్లి మండలం కొదురుపాకకు చెందిన ఆటో డ్రైవర్ నల్ల సతీశ్‌పై మంగళవారం శాతవాహన విశ్వవిద్యాలయం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు.
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడతావా అంటూ బూతులు తిడుతూ గాయపర్చారు. ఈ విషయంపై బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, చొప్పదండి మాజీ ఎమ్మెలే సుంకె రవిశంకర్, మరికొంత మంది నాయకులు కలిసి టూటౌన్ పోలీసు స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
సతీశ్‌పై జరిగిన దాడి విషయంపై టూటౌన్లో ఫిర్యాదు చేయడానికి సుంకెరవిశంకర్ ఠాణాకు వెళ్లారు. ఆయన పోలీసు స్టేషన్లో ఉండగానే బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు, సుంకె రవిశంకర్ వెంటనే బెదిరింపు కాల్‌కు సంబంధించిన అంశంపై ఫిర్యాదు చేశారు. సతీశ్‌ను తీసుకొని పీఎస్‌లో ఫిర్యాదు చేస్తావా..? ఇక ముందు నువ్వు చొప్పదండి నియోజకవర్గంలో, గ్రామాల్లో తిరిగితే చంపేస్తాం అని బెదిరించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను తిడితే నిన్ను బతకనివ్వమని బెదిరించినట్టు ఆ ఫిర్యాదులో వివరించారు.