ఖానాపురం, డిసెంబర్ 3 : బీఆర్ఎస్ పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దండుగలా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. రైతులపై సీఎం రేవంత్‌రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. వరంగల్ జిల్లా ఖానాపురంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడా రు. రైతులతో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడను ప్రారంభించాడని, దీంతో వారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింటున్నదని అన్నారు.
గతంలో ఎంతో మంది సీఎంల పాలన చూశామని, రేవంత్‌రెడ్డి లాంటి దిగజారిన పాలనను ఎప్పు డూ చూడలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేసింది గ్రామీణ ప్రాంత ప్రజలేనని గుర్తుంచుకోవాలని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పథకమైనా సంపూర్ణంగా అమలు చేసిందా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలోని పథకాలను కొనసాగిస్తే కేసీఆర్‌కు మంచిపేరు వస్తుందని.. వాటినే రద్దు చేసిన నీచ చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిదని దుయ్యబట్టారు.