కంటోన్మెంట్/చిక్కడపల్లి, ఏప్రిల్ 22: కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే జీ సాయన్న సతీమణి గీత బేగంపేటలోని కిమ్స్ దవాఖానలో గుండెపోటుతో బుధవారం కన్నుమూశారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్, రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేశ్, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి, బోర్డు మాజీ సభ్యులు అనిత ప్రభాకర్, నళినికిరణ్, నాయకులు రావుల సతీశ్, బీజేపీ నాయకుడు నాగభూషణ్‌రెడ్డి అశోక్‌నగర్‌లోని ఇంటికి వెళ్లి ఆమె పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గీత అంత్యక్రియలు గురువారం మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో నిర్వహించనున్నారు. మూడేండ్ల క్రితం అనారోగ్యంతో సాయన్న మృతి చెందగా, ఆయన స్థానంలో పోటీ చేసిన సాయన్న కుమార్తె లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. తాజాగా సాయన్న భార్య గీత కూడా మృతి చెందటంతో వారి కుటుంబంతోపాటు, కంటోన్మెంట్లో విషాదఛాయలు అలుముకున్నాయి.