హైదరాబాద్, మే 28(నమస్తే తెలంగాణ): జయ జయహే తెలంగాణ.. గీతంలో స్వల్పంగా సవరణలు చేయాలనే ప్రతిపాదనకు కవి, రచయిత అందెశ్రీ సవరణలకు ఒప్పుకోనందునే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం దానిని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని తెలంగాణ సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ గీతంలోని నాలుగు చరణాలను స్వల్పంగా సవరించి రాష్ట్ర గీతంగా ప్రకటించాలని నాడు కేసీఆర్ భావించారని, దీనిపై 2014లోనే అందెశ్రీతో ఆయన అనేకసార్లు చర్చలు కూడా జరిపారని తెలిపారు. దానికి అందెశ్రీ మాత్రం తాను రాసిన పది పన్నెండు చరణాలను యథావిథిగా ఉంచాలని పట్టుబట్టారని, లేకుంటే ఆ పాటను రాష్ట్ర గీతంగా వాడొద్దని చెప్పారని పేర్కొన్నారు.
రాష్ట్ర గీతానికి పది పన్నెండు చరణాలు పెట్టడం సాధ్యంకాదని ఆనాడు భావించినట్టు పేర్కొన్నారు. దీంతో వివాదం ఎందుకనే ఉద్దేశంతో కేసీఆర్ ఈ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించలేదని, అంతే తప్ప జయ జయహే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించవద్దనో, లేక అందెశ్రీని అగౌరపర్చాలనో ఎంతమాత్రం కాదని రసమయి తెలిపారు.