BRS | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలనలో తెలంగాణ పాట పాడాలంటేనే భయానక పరిస్థితులు ఉండేవి.. వాటిని తట్టుకుని పాడితే కేసులు, హత్యలు జరిగేవి.. అలాంటి దశలో ఆట, పాటకు గులాబీ జెండాయే ఆయుధంగా నిలిచింది.. అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ సాంస్కృతిక సారధి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ పునరుద్ఘాటించారు. ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కళా ప్రదర్శనలపై తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో కళాకారుల రిహార్సల్స్‌లో పాల్గొన్న ఆయన శుక్రవారం పలు విషయాలను నమస్తే తెలంగాణతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.. ఒకప్పుడు తెలంగాణ పాట, మాట వెక్కిరింతకు గురయ్యేది. తెలంగాణోళ్లను హీనంగా చూసేవాళ్లు. మాట్లాడితే నవ్వుకునేవాళ్లు. సినిమాల్లోనైతే తెలంగాణ మాట, పాట జోకర్లకు వాడి హేళన చేసేవాళ్లు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పాటలు పాడితే కేసులు పెట్టేవాళ్లు.
నక్సలైట్ అని ముద్రవేసి ఎన్కౌంటర్ చేసేవాళ్లు. అసలు తెలంగాణ రాష్ట్రం సాకారమనేది ఈ జన్మలో చూడలేమేమో అనేలా అప్పటి పరిస్థితులు ఉండేవి. కానీ, ఒకే ఒక్కడు.. బక్కపల్చని ధైర్యశాలి.. ఆయనే కేసీఆర్. తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, సాంస్కృతిక కళలు, సంప్రదాయాలన్నింటిపై పూర్తి అవగాహనతో ఉన్న ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించాడు. ఆ పార్టీ గులాబీ జెండా నీడలో తెలంగాణ ఆటలు, పాటలు ఊపిరిపోసుకున్నాయి. కేసీఆర్ అనే వ్యక్తి లేకుండా తెలంగాణ పాట లేదు. 2001లో కేసీఆర్ పార్టీ పెట్టాక.. 2002 నుంచి ధూంధాంలు షురూ అయ్యాయి. కేసీఆర్ ఎక్కడ సభ పెట్టినా.. అక్కడ పాట శికం ఊగాలే.. తెలంగాణ ఎందుకు అవసరమో.. తెలంగాణ ఎంత ఘోసపడుతుందో పాట రూపంలో వివరించినం. ఈ ధూంధాంలను కేసీఆరే ప్రోత్సహించేవారు. కళాకారులకు ఎంతగానో గౌరవం ఇచ్చి వారికి ప్రోత్సాహం అందించేవారు. తెలంగాణ పడుతున్న కష్టాలను పాటల రూపంలో ప్రతి పల్లెకు చేరాలని కేసీఆర్ చెప్పేవారు.
బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచే ధూంధాం పండుగ షురూ అవుతుంది. వేదికపై వందలాది కళాకారులు తెలంగాణ ఆట, పాటలను విభిన్న సాంస్కృతిక రూపాల్లో ప్రదర్శిస్తారు. బండెనక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి.. ఓరుగల్లు సభకు తరలిరా, ఇది తెలంగాణ కోటి రతనాల వీణ నుంచి, సారే కావలంటున్నరే తెలంగాణ పల్లెలోనా.. అన్న పాటల వరకు పెద్ద ఎత్తున కళారూపాలు ప్రదర్శిస్తారు. వివిధ రూపాల్లో ప్రజల్లో కేసీఆర్‌పై ఉన్న అభిమానాన్ని చాటుతారు. పదేండ్లు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ దేశానికి ఆదర్శంగా నిలిచేల పాలన అందించారు. కాంగ్రెస్ అధికారలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇంకా ఎటువంటి మేలు ప్రజలకు జరగలేదు. అందుకే మళ్లీ కేసీఆర్ సారే కావాలని జనం కోరుకుంటున్నారు. ఆయా అంశాలపై వివిధ కళారూపాల ప్రదర్శనలు ఉంటాయి.. అని రసమయి బాలకిషన్ నమస్తే తెలంగాణకు వివరించారు. తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే రిహార్సల్స్‌లో కళాకారుడు మానుకోట ప్రసాద్ పాల్గొన్నారు.