వేలేరు : ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన ప్రజాపాలన కాదని అసమర్ధ పాలన అని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య తీవ్రంగా విమర్శించారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పార్టీ కార్యకర్తలు, నాయకులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం రాజయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా పాలనలో ఎంతమంది మహిళలు కోటీశ్వరులయ్యారో ప్రభుత్వం చెప్పాలి అని ప్రశ్నించారు. రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేదల సంక్షేమం విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హామీల అమలులో జాప్యం చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. వంటావార్పు కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
అసెంబ్లీ ఘటనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసన
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకుని అసెంబ్లీలోకి వెళ్లకుండా నిరోధించడంతో పాటు, వారిపై పోలీసుల చేత దాడులు చేయించి అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వేలేరు మండల కేంద్రలలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై జరిగిన దాడులు, అక్రమ అరెస్టులను పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని తాటికొండ రాజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాజీ జడ్పిటిసి కీర్తి వెంకటేశ్వర్లు, సర్పంచ్ మరిజె అనిత నర్సింహారావు, కర్ర సోమిరెడ్డి, భూపతి రాజు, మారబోయిన రాజు, కొయ్యడ మహేందర్, గోవింద సురేష్, అంగోత్ సంపత్, ఎం.డి. జానీ, మౌనిక, స్వరూప పాల్గొన్నారు.