స్టేషన్ ఘన్పూర్, ఏప్రిల్ 9 : కడియం శ్రీహరి సవాల్‌కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాల్లోని అటవీ భూములను ఎమ్మెల్యే శ్రీహరి, తన కూతురు, అల్లుడు బినామీల పేర్లతో అక్రమంగా దోచుకునేందుకు యత్నిస్తున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించిన విషయం తెలిసిందే. దీనికి స్పందించిన కడియం శ్రీహరి భూములను కబ్జా చేసినట్టు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేయడమే కాకుండా పల్లా, రాజయ్య వద్ద గులాంగిరీ చేస్తానని, లేకుంటే వారు చేయాలని సవాల్ విసిరారు. దీనికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య స్పందించి బుధవారం స్టేషన్ ఘన్‌పూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడియం విసిరిన సవాల్‌ను స్వీకరిస్తున్నానని, ముహూర్తాల పిచ్చి ఉన్న కడియం తేదీ, సమయం, స్థల ముహూర్తాన్ని నిర్ణయించాలని సూచించారు. కడియంపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టంచేశారు. రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులతోపాటు వారికి సహకరించిన పోలీస్ సిబ్బంది రావాలని, తనతోపాటు ఎమ్మెల్యే పల్లా వస్తారని చెప్పారు. అటవీ భూముల విషయం నిజనిర్ధారణ కాకముం దే, సర్వే రిపోర్టు, సీసీఎఫ్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే బుల్డోజర్లు, జేసీబీలు తీసుకుపోయి పోలీసుల పహారాలో రెవెన్యూ అధికారులు దగ్గరుండి భూములను చదును చేయించారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడి పరిస్థితిని పరిశీలించడానికి తాను వెళ్లగా 2 కిలోమీటర్ల మేర చెట్ల నరికివేత, మైనింగ్ పర్మిషన్ లేకుండానే వేల ట్రాక్టర్ల మొరం తరలింపు జరిగినట్టు గుర్తించామని చెప్పారు. 80 ఏండ్లుగా ఆ భూము ల్లో సాగులేదని, ఫారెస్ట్ అధికారులు తీసిన కందకం అవతల ఈ తతంగం చేశారని చెప్పారు.
ఈ ఫారెస్ట్ భూముల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దేవునూరు పరిసర ప్రాంతాల్లో కడియం, ఆయన కుంటుంబ సభ్యులకు బినామీల పేర్లతో భూమి ఉందని, రెండేళ్ల నుంచి పాలేర్లతో సాగుచేస్తున్నట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఆరు నెలల నుంచి ముప్పారం, నారాయణగిరిలో 23 మంది రైతుల పేర్లతో 43.38 ఎకరాల్లో పట్టాలున్నట్టు చెబుతున్నారని, అవి కూడా బినామీ పేర్లతో కడియం తీసుకున్నట్టు ఆధారాలు ఉన్నాయని స్పష్టంచేశారు. మార్చి 27న ఎలాంటి అనుమతులు లేకున్నా జేసీబీలతో ఉపాధి హామీ పథకం ద్వారా కోట్లు ఖర్చు పెట్టి పెంచిన మొక్కలను నరకడంతోపాటు, మైనింగ్ అనుమతులు లేకుండా వేల ట్రాక్టర్ల మొరాన్ని తరలించి అటవీ సంపదను ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.