స్టేషన్ ఘన్పూర్, సెప్టెంబర్ 20: ‘ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి ఒక్కసారి కూడా నియోజకవర్గానికి రాకుండానే అభివృద్ధి చేశానని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. నిజంగా అభివృద్ధి చేస్తే వాటికి సంబంధించిన శిలా ఫలకాలు ఎక్కడున్నాయో చూపించాలి. మనం ఇద్దరం ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎవరు అభివృద్ధి చేశారో ప్రజల ముందు నిరూపించుకోవడానికి రావాలి’ అని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సవాల్ విసిరారు. శనివారం ఆయన జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో సుమారు వెయ్యి కోట్లతో అభివృద్ధి చేశానని జీవో పత్రాలను చూపిస్తున్న ఎమ్మెల్యే కడియం సంతకం ఎందుకు లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రొసీడింగ్స్‌పై సంతకం చేసే ధైర్యం కూడా కడియంకు లేదని దుయ్యబట్టారు. కడియం సంతకం లేని ప్రొసీడింగ్స్ చెత్త కాగితాలతో సమానమంటూ తగలబెట్టారు. నేను నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని, నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకర్ చెబుతారనడం సిగ్గుచేటు’ అని అన్నారు. బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన కడియం రాజీనామా చేయాలని అన్నారు.