ములుగు, ఏప్రిల్4 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కనుసన్నల్లో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని, బీఆర్ఎస్ నాయకులపై నమోదవుతున్న అక్రమ కేసులకు కార్యకర్తలు అధైర్యపడొద్దని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు అధ్యక్షతన రజతోత్సవ మహాసభ ముఖ్యనాయకుల సన్నాహక సమావేశం నిర్వహించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టిందిలేదని గుర్తుచేశారు. 15 నెలలుగా ములుగు జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని తెలిపారు. కేసుల విషయంలో కార్యకర్తలు అధైర్యపడొద్దని, పార్టీ నాయకత్వం, జిల్లా నాయకత్వం అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలు కలిసి కట్టుగా పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భవించి 25సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో కేసీఆర్ నాయకత్వంలో జరగనున్న రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా నుంచి సభకు 15వేల మంది తరలిరావాలని తెలిపారు.