నర్సంపేట, ఫిబ్రవరి 9 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.500 బోనస్ హామీ బోగస్‌గానే తయారైందని, రాష్ట్ర రైతాంగాన్ని రేవంత్ సర్కార్ మోసం చేసిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి, 50శాతం కూడా పూర్తి చేయలేదని చెప్పారు. రూ.2లక్షలపై రుణం ఉన్న రైతులు మిగతా డబ్బులను బ్యాంక్‌లకు చెల్లించారని, రుణ మాఫీ అవుతుందనుకుంటే మళ్లీ అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తంచేశారు. రైతు భరోసా 15వేలు ఇస్తామని చెప్పి 12వేలకు తగ్గించడం దారుణమని, నేటికీ రైతుభరోసా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమకాకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 86,40,000 క్వింటాళ్ల ధాన్యానికి సంబంధించిన రూ.432 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్‌లోనే ఉన్నాయని, రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమకాక పోవడంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని, సమయానికి పెట్టుబడి, విద్యుత్, నీళ్లతో వ్యవసాయం పండుగగా మారిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే హామీలన్నీ అమలు చేసి గ్రామాల్లోకి రావాలని, లేదంటే ప్రజా తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు.