కొడంగల్, అక్టోబర్ 9: సీఎం ఇలాకాలో ఫార్మా బాధిత రైతుల ఆందోళన ఉధృతమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మహా పాదయాత్రకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం పోలెపల్లి ఎల్లమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మహాపాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. ఇందుకోసం పలు గ్రామాల నుంచి తరలివస్తున్న రైతులను ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటుచేసి పోలీసులు అడ్డుకున్నారు. అయినా బారికేడ్లు తోసుకుని పోలెపల్లి ఆలయానికి రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. మహాపాదయాత్రలో పాల్గొనేందుకు వస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిని, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామం వద్ద పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దాంతో మహాధర్నాకు తరలివచ్చిన రైతులు, బీఆర్ఎస్ నాయకలు ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా, అరెస్టును ఖండిస్తూ.. హకీంపేట గ్రామ కూడలిలో పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు.
ధర్నాలో పోలీసులు, బాధిత రైతులు, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫార్మా కంపెనీలు వద్దు.. పచ్చటి భూములను కాపాడాలని శాంతియుతంగా పాదయాత్ర చేపడితే అరెస్టులతో అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని రైతులు, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. ఫార్మాతో కాలుష్యం అవుతుందని రైతులు మొత్తుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. రైతుల శవాలపై ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని, ఫార్మా కంపెనీల రద్దు కోసం పోరాడేందుకు ఎంతవరకైనా సిద్ధమని రైతులు తేల్చిచెప్పారు. పరిగి పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజలకు అనుమానాలున్నాయని, వాటిని నివృత్తి చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పాటుపడాలని, ప్రజలు వ్యతిరేకిస్తున్న కాలుష్య కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని సీఎంను చేస్తే.. ఆయన కొడంగల్‌లో ఫార్మా కంపెనీలతో కాలుష్యం అంటగట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో 14 వేల ఎకరాలు కేటాయించామని, అక్కడ ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేయకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే సీఎం ఇంటి ముందు ధర్నా చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
వికారాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా విలేజ్ ఏర్పాటు విషయంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్మా విలేజ్ పేరిట రైతుల భూములను లాక్కోవటాన్ని నిరసిస్తూ శాంతియుతంగా పాదయాత్ర చేసేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిల అరెస్ట్‌లు అప్రజాస్వామికమని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి నిర్బంధాలు గతంలో ఎన్నడూ చూడలేదని, అరెస్ట్ చేసిన బీఆర్ఎస్ శ్రేణులను వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అరెస్ట్‌లతో ప్రజా ఉద్యమాలను ఆపలేరని స్పష్టంచేశారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఫార్మా విలేజ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సబితారెడ్డి డిమాండ్ చేశారు.
వనపర్తి టౌన్, అక్టోబర్ 9: కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి అరెస్టు హేయమైన చర్యగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మా కంపెనీ కోసం భూసేకరణను వ్యతిరేకిస్తూ బుధవారం రైతులతో కలిసి పాదయాత్రకు వెళ్లిన మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డిని వి కారాబాద్ జిల్లా తుంకిమెట్ల వద్ద పోలీసులు అ రెస్టు చేశారు. పట్నం, నవీన్‌ను పోలీసులు కొత్తకోట పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రితోపాటు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పీఎస్‌కు వెళ్లి అరెస్టయిన నేతలకు సంఘీభావం తెలిపారు. కార్పొరేట్ వ్యవస్థతో కుమ్మక్కై రైతులను ముంచుతున్న సీఎం రేవంత్‌రెడ్డి చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఎన్ని నిర్బంధాలు చేసినా ప్రజలు, కర్షకుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.