కోస్గి, జనవరి 11: కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆనవాళ్లు లేకుండా చేస్తామని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కోస్గిలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాననడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి అభివృద్ధిని గాలికొదిలేశారని ఆరోపించారు. మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్‌పై వ్యతిరేకత ప్రదర్శించారని, మున్సిపల్ ఎన్నికల్లో కూడా రేవంత్‌రెడ్డికి పరాభవం తప్పదని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ హామీలు, ఆరు గ్యారెంటీలు అమలుకాని విషయాలను ప్రజలకు వివరించి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.