హైదరాబాద్ కాప్రా డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): కొడంగల్ నుంచే సీఎం రేవంత్‌రెడ్డి పతనం మొదలైందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మండిపడ్డారు. తాను ఏ తప్పూ చేయకపోయినా లగచర్ల ఘటనకు కుట్ర చేశానంటూ అక్రమ కేసు పెట్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాజకీయకుట్రలో భాగంగానే తనమీద, కేటీఆర్ మీద అక్రమ కేసులు పెట్టారని నిప్పులుచెరిగారు. ఫార్మా విలేజ్ కోసం భూసేకరణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణలో జరిగిన ఉద్రిక్తతల కేసులో అరెస్టయి జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న కొడంగల్ మాజీఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన తర్వాత మాట్లాడుతూ రైతుల కోసం ఎన్నిసార్లు జైలుకు వెళ్లటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు.
తనతో పాటు, రైతుల బెయిల్ కోసం కృషి చేసిన కేటీఆర్‌కు, పార్టీ లీగల్‌సెల్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క కేసే కాదు.. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చిచెప్పారు. నరేందర్‌రెడ్డి విడుదల సందర్భంగా గురువారం సాయంత్రం 5 గంటలకే మాజీమంత్రులు లక్ష్మారెడ్డ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో చర్లపల్లి జైలు వద్దకు వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన నరేందర్‌రెడ్డికి తిలకం దిద్ది, కండువాలు కప్పి భుజాలపైకి ఎత్తుకున్నారు.
హర్షధ్వానాలు వ్యక్తంచేస్తూ పటాకులు కాల్చారు. ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు పెట్టినా న్యాయం గెలిచిందని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, నరేందర్‌రెడ్డి జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. అభిమానంతో స్వాగతం పలికిన కార్యకర్తలకు నరేందర్‌రెడ్డి అభివాదం చేశారు. నరేందర్‌రెడ్డికి స్వాగతం పలికిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు మహేశ్‌రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేశ్‌రెడ్డి, మీర్పేట్ హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ జే ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నేతలు సోమశేఖర్‌రెడ్డి, బద్రుద్దీన్, మహిపాల్‌రెడ్డి, సాయిజెన్ శేఖర్ పాల్గొన్నారు.
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ధీరోదాత్తుడని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ఏ తప్పూ చేయకపోయినా కొడంగల్ రైతుల కోసం నరేందర్‌రెడ్డి 37 రోజులు జైలులో ఉన్నారని తెలిపారు. జైలులో కలిసేందుకు వెళితే ‘అన్నా..! నా కోసం మీరేం దిగులు పడొద్దు. నా ఆరోగ్యం ముఖ్యంకాదు. నేను ఇంకో 10 రోజులు ఇక్కడే (జైలులో) ఉన్నా మంచిదే. కానీ, పాపం రైతులు, వారి కుటుంబాలు ఆందోళనలో ఉంటాయి.
వాళ్ల బెయిల్ కోసం గట్టిగా ప్రయత్నం చేయండి’ అని నరేందర్‌రెడ్డి చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. నరేందర్‌రెడ్డి విడుదల సందర్భంగా తెలంగాణ భవన్లో శాసనమండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పట్నం నరేందర్‌రెడ్డి లగచర్ల రైతుల కోసం నిలబడ్డ నాయకుడని కొనియాడారు.