కొడంగల్, అక్టోబర్ 13 : వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ నియోజక వర్గంపై సీఎం సవతి ప్రేమ చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. సీఎం తన సొంత గ్రామంలో రూ.రెండు వందల కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించడంపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఆయన కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూరు, దుద్యాల, కొత్తపల్లి, గుండుమాల్ మండలాల్లో దసరా వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం నరేందర్‌రెడ్డి కొడంగల్‌లో మీడియాతో మాట్లాడారు. దసరా రోజున సీఎం తన సొంత గ్రామంలో రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించి.. తనను ఎమ్మెల్యేగా గెలిపించి.. ముఖ్యమంత్రిని చేసిన కొడంగల్ నియోజకవర్గ ప్రజలపై సవతి తల్లి ప్రేమను చూపుతున్నారని మండిపడ్డారు. సోలార్ పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌ను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. కొడంగల్‌కు కాలుష్యాన్ని అంటగట్టే ఫార్మా కంపెనీల ఏర్పాటు చేసే దిశగా సీఎం రేవంత్ చర్యలు తీసుకోవడం బాధాకరమని అన్నారు.
బీఆర్ఎస్ హయాంలో ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం 14 వేల ఎకరాలను సేకరిస్తే, దాన్ని కాదని కొడంగల్‌లో ఏర్పాటు చేసేందుకు సీఎం ఎందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లాలోని కొత్తూరులో 50 ఎకరాల్లో ఫార్మా కంపెనీని ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతం పూర్తిగా కాలుష్యంతో నిండిపోయి ప్రజలు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఫార్మా కాకుండా టెక్స్టైల్, ఐటీ తదితర కంపెనీలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని అన్నారు. ఫార్మా కంపెనీలను ఏర్పాటు చేయాలని చూస్తే కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీని కేవలం 30 శాతం మందికే పూర్తి చేసిందని.. సీఎం సొంత నియోజకవర్గంలోనూ పూర్తి స్థాయిలో కాలేదని ఆయన పేర్కొన్నారు. దసరా నాటికి రైతు భరోసా అమలు చేస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు.