కోస్గి, జూలై 3 : రైతులు అరిగోస పడ్తుంటే.. పట్టించుకోవాలన్న సోయి కాంగ్రెస్ సర్కార్‌కు లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డిది రైతుల సంక్షేమం పట్టని దద్దమ్మ సర్కార్ అని విమర్శించారు. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఏకైక సీఎం రేవంత్‌రెడ్డి అని మండిపడ్డారు. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రూ.2.60 లక్షల కోట్లు అప్పు చేసి అభివృద్ధి పనులు చేపడితే.. కాంగ్రెస్ కేవలం రెండున్నరేండ్ల పాలనలో రూ.4 లక్షల కోట్లు అప్పు చేసిందని ఆరోపించారు. చేసిన అప్పుతో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో భష్టుపట్టించారని మండిపడ్డారు. నాడు టింగ్.. టింగ్.. మంటూ పంటల సీజన్‌కు ముందే రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో పడేదని, ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే బాధిత కుటుంబానికి బీమాతోపాటు ధీమానిచ్చిన ఆపద్బాంధవుడు కేసీఆర్ అని కొనియాడారు.
కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి మాట పక్కన పెడితే రైతుబంధును మూడుసార్లు ఎగ్గొట్టిందని దుయ్యబట్టారు. ‘రైతు బీమాను కనుమరుగు చేసింది మీ సర్కార్ కాదా? రైతుల వడ్లకు బోనస్ లేకుండా చేసింది మీ ప్రభుత్వం కాదా?’ అని ప్రశ్నించారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌ను ఇచ్చిన 420 హామీలు నెరవేర్చే వరకు వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అప్పులపై చర్చకు సిద్ధమంటూనే మంత్రి జూపల్లి.. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు తెలంగాణ భవన్ నుంచి బయటకు రాకుండా పోలీసులతో అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అడిగిన ప్రభుత్వ స్కామ్‌లపై చర్చకు వచ్చే దమ్ము లేక తోకముడిచారని ఎద్దేవా చేశారు. నిజంగా ప్రజలపై విశ్వాసం ఉంటే.. ముక్కు నేలకు రాసి మంత్రి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.