వరంగల్ : తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత రెండు పర్యాయలు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించింది. వరంగల్ తూర్పు నియోజకవర్గ అభివృద్ధే ద్యేయంగా నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలో నా వంతు కృషి చేశాను. నా ప్రాణమున్నంత వరకు ప్రజల పక్షాన నిలబడుతానని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్(Former MLA Nannapaneni )అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.
ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. వారిని కాపాడడంలో ముందుంటానని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల నిర్ణయాన్ని శిరసావహిస్తూ అధికారంలో లేకపోయినా ప్రజా సమస్యల పట్ల పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఎవరూ బాధ పడవద్దు, అధైర్యపడొద్దన్నారు.
రాజకీయంలో గెలుపు, ఓటములు సహజం అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానని తెలిపారు.మూడు సంవత్సరాలు మేయర్గా.. ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను ఆశీర్వదించి ముందు తీసుకుపోయినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.