హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిది కమిట్మెంట్ కాదని, వెన్నుపోటు రాజకీయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, చంద్రబాబుతో వెళ్లి, పదేండ్లు మంత్రి పదవి అనుభవించారని, ఆ తర్వాత ఆయనకూ వెన్నుపోటు పొడిచి బీఆర్ఎస్లోకి వచ్చారని, కేసీఆర్ పెట్టిన రాజకీయ భిక్షతో మంత్రి పదవి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు అనుభవించారని విమర్శించారు. చివరకు కేసీఆర్‌కూ వెన్నుపోటు పొడిచిన చరిత్ర కడియానిది అని మండిపడ్డారు. సీఎం రేవంత్ ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన వేరే పార్టీలోకి వెళ్లడం ఖాయమన్నారు.
బిల్డప్ బాబాయిలా మాటలు
నీచమైన చరిత్ర కలిగిన కడియం శ్రీహరి.. తన కంటే నిజాయితీపరుడు ఎవరూ లేరని అంటూ చిలుకపలుకులు పలుకుతున్నారని, బిల్డప్ బాబాయిలా తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని నన్నపనేని ఎద్దేవా చేశారు. డొక్కు స్కూటర్ మీద వచ్చిన కడియం శ్రీహరి పరిస్థితి ఏమిటో తనకు తెలుసునని, స్థాయి మరిచి మాట్లాడవద్దనిని హితవు పలికారు. కేసీఆర్ కుటుంబం అవినీతిపరులు అంటూ కడియం ఇష్టారాజ్యంగా మాట్లాడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రజలను కలువడానికి స్టేషన్ ఘన్పూర్ నుంచి 100 బస్సులు పెట్టి తీసుకెళ్లలేదా? అని సూటిగా ప్రశ్నించారు. కడియం శ్రీహరి లాంటి రాజకీయ కుట్రదారుడు దేశంలోనే బహుశా ఎవరు ఉండకపోవచ్చునని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్ జాతిపిత కాకపోతే.. ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్లో సిమ్‌కార్డు మార్చినట్టు పార్టీలు మారుతున్నారు అని ఎద్దేవా చేశారు. కడియం శ్రీహరికి ఏ మాత్రం ఇజ్జత్ ఉన్నా.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. భూములు, పెట్రోల్ బంకులు, రూ.5 కోట్ల విలువైన ఇల్లు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
కేసీఆర్ కాళ్లు కడిగినా మోక్షం రాదు: కొమ్ముల
కేసీఆర్ కాళ్లుకడిగి నెత్తిన చల్లుకున్నా.. కడియం శ్రీహరికి మోక్షం రాదు అని బీఆర్ఎస్ నేత కొమ్ముల నరేందర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ వాళ్ల బూట్లు నాకుతున్న కడియం శ్రీహరి కేసీఆర్‌పై అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆరోపించారు. కేసీఆర్‌పై కడియం చేసిన వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని లేకపోతే తెలంగాణలో తిరుగనిచ్చేది లేదని హెచ్చరించారు.
కడియం దళితుడు కాని దళితుడు: బొమ్మర
కడియం దళితుడు కాని దళితుడని, ఈ అంశంపై తీవ్రమైన చర్చ జరుగుతున్నదని బీఆర్ఎస్ నేత రామ్మూర్తి ఆరోపించారు. కేసీఆర్ గురించి ఇష్టంవచ్చినట్టు మాట్లాడుతున్న కడియంను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కడియంకు దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని డిమాండ్ చేశారు.