హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు రాచమర్యాదలు ఎలా చేస్తారని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్ర శ్నించారు. లగచర్ల ఘటన తర్వాత వికారాబా ద్ కలెక్టర్ తన కార్యాలయం నుంచి బయటకు వచ్చి మరీ తిరుపతిరెడ్డికి స్వాగతం పలికారని, గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా? అని నిలదీశారు. తెలంగాణభవన్‌లో ఆదివారం బీఆర్ఎస్ నేతలు పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, కోట్ల మహిపాల్ముదిరాజ్, అనంతరెడ్డి, గోపాల్, చంద్రశేఖర్‌రెడ్డి, పాండు తదితరులతో కలిసి మెతుకు ఆనంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. తిరుపతిరెడ్డికి ఏ పదవి ఉన్నదని కలెక్టర్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించి మర్యాదలు చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారుల సమక్షంలో సూల్ విద్యార్థులను ఎండలో నిలబెట్టి మరీ ఆయనకు స్వాగతం పలకడం ఏమిటని మండిపడ్డారు. ప్రభుత్వ భవనాలకు ఆయన ఏ హోదాలో భూమి పూజ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెకులు కూడా ఆయనే పంచుతున్నారని తెలిపారు. వార్డు మెంబర్ కూడా కానటువంటి తిరుపతిరెడ్డికి దకుతున్న ప్రొటోకాల్ ఏం సందేశం ఇస్తున్నదని నిలదీశారు.
తిరుపతిరెడ్డికి దకుతున్న ప్రభుత్వ మర్యాదలే ప్రజాస్వామ్యమా? ఇదేనా రేవంత్‌రెడ్డి ఏడో గ్యారెంటీ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఖూనీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకుడైన తిరుపతిరెడ్డిపై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదని నిలదీశారు. దుర్గంచెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఆయన ఇల్లు ఎందుకు కూల్చడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించారు. కొండారెడ్డిపల్లిలో రేవంత్‌రెడ్డి ఇల్లు కూడా బఫర్‌జోన్‌లోనే ఉన్నదని ఆరోపించారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతి నియోజకవర్గానికి వంద మంది కాంగ్రెస్ గూండాలను తయారు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత పంజుగుల శ్రీశైల్‌రెడ్డి ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ గూండాలు దాడి చేశారని, గూండాలను ఆపాల్సిన పోలీసులు వీడియోలు తీస్తూ చోద్యం చూశారని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి గూండాలను ప్రోత్సహిస్తుంటే తిరుపతిరెడ్డి అరాచకాలు పెరగక ఏమవుతాయని ప్రశ్నించారు.