హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌తో కలిసి తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలను వక్రీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మహాన్యూస్ చానల్ అసత్య ప్రసారాలు చేసిందని నిప్పులు చెరిగారు. కేటీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది అభిమానులున్నారని, ఆయనపై ఇలాంటి అసత్యాలు ప్రసారాలు చేస్తే వారు ఊరుకోరని హెచ్చరించారు. ‘ఏపీ సీఎం చంద్రబాబు శిష్యుడు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నరు. కేటీఆర్‌పై రేవంత్ ఎల్లో జర్నలిజం పేరుతో బురద చల్లుతున్నరు’ అని మండిపడ్డారు.
తెలంగాణ పెట్టుబడులను ఆంధ్రాకు తరలించే కుట్ర
ఓ మీడియా చానల్ అధినేత తెలంగాణపై కుట్రలు చేసి, పెట్టబడులను ఆంధ్రాకు తీసుకెళ్లాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆ న్యూస్ చానల్ వ్యతిరేకంగా పని చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి రక్తపాతానికి, హింసకు తావు లేకుండా కేసీఆర్ ఉద్యమాన్ని నడిపించి రాష్ర్టాన్ని సాధించారని, తెలంగాణ ప్రజలకు మాట అంటే పడే మనస్తత్వం లేదని గుర్తుచేశారు. ఇలా రెచ్చగొడితే మాత్రం తెలంగాణ ప్రజలు తిరగబడుతారని హెచ్చరించారు.
ఉద్యమం ఇంకా లైవ్‌లోనే : క్రాంతి
తెలంగాణ ఉద్యమం ఇంకా ముగిసిపోలేదని, అది ఇంకా లైవ్‌లోనే ఉన్నదని మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ హెచ్చరించారు. ఈ ఘటనతో తెలంగాణ వ్యతిరేకులంతా మళ్లీ ఏకమవుతున్నారని, బీఆర్ఎస్పై విషం చిమ్ముతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ కక్షతోనే కేటీఆర్‌పై అసత్యాలు ప్రసారం చేశారని విమర్శించారు. పల్లె రవి, గజ్జెల నాగేశ్ పాల్గొన్నారు.