కుమ్రంభీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ) : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అధికార పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన కోనేరు కోనప్ప గతేడాది మార్చిలో కాంగ్రెస్‌లో చేరారు. తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల కౌటాల మండలంలో కార్యకర్తలు, సన్నిహితులతో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కారు.
ప్రాణహిత నదిపై వంతెన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వంతెనను రద్దుచేసిందంటూ మండిపడ్డారు. గ్రామాల్లోకి వచ్చే కాంగ్రెస్ నాయకులను వీర్దండి వంతెన కోసం నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీని వీడుతున్న తాను స్వతంత్రంగానే ఉంటానంటూ ప్రకటించారు. కాగజ్‌నగర్‌లో గురువారం మంత్రి సీతక్క ఆధ్వర్యంలో కాంగ్రెస్ నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమానికి సైతం కోనప్పను ఆహ్వానించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా శుక్రవారం స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మద్దతుగా పెంచికల్‌పేటలో ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంపై ఆయన స్పందిస్తూ.. అధికారికంగా రాజీనామా చేయలేదన్నారు. రేపు అధికారికంగా కోనప్ప రాజీనామా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఆయన సన్నిహితులు తెలిపారు.