Jupally Krishna rao | హైదరాబాద్, ఆగస్టు 2(నమస్తే తెలంగాణ): మాజీ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు పరిస్థితి దారుణంగా తయారైంది. కాంగ్రెస్ చేరేందుకు ఆయన పెట్టుకున్న ముహూర్తాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి. గత నెల 20న భారీ బహిరంగ సభ నిర్వహించి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవాలని భావించారు. అది వాయిదా పడింది. అదే నెల 30న మరో ముహూర్తం ఖరారు చేశారు. అది కూడా కలిసిరాక ఈ నెల 5న కాంగ్రెస్లో చేరాలని భావించారు.
అదికూడా జరిగే అవకాశం లేకపోవడంతో నేరుగా ఢిల్లీ వెళ్లి పార్టీలో చేరాలని అనుకున్నా అదీ జరగలేదు. రాహుల్, ప్రియాంకగాంధీ ఇప్పటికే ముఖం చాటేశారు. ఆయన చేరిక సభకు వచ్చేందుకు నిరాకరించారు. చివరికి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సమక్షంలో పార్టీలో చేరాలని భావిస్తే ఆయన కూడా ‘హ్యాండ్’ ఇచ్చారు. ముందస్తుగానే షెడ్యూల్ చేసినా ఖర్గే అందుబాటులో లేకపోవడం గమనార్హం.