ఖలీల్‌వాడి, ఫిబ్రవరి 7: మాట తప్పడం, మడమ తిప్పడం కాంగ్రెస్‌కు మాత్రమే ఉన్న పేటెంట్ హక్కు అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రజలను మోసం చేయడమే ఆ పార్టీ నైజమని మండిపడ్డారు. కుల గణన పేరిట రేవంత్‌రెడ్డి బీసీల గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయలేని కాంగ్రెస్ నేతలు ఓట్ల కోసం మళ్లీ గ్రామాల్లోకి వస్తున్నారని, హామీల అమలు ఏమైందని ప్రజలు వారిని నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధు, తులం బంగారం, పింఛన్ల పెంపు వాటి హామీలు ఎగ్గొట్టిన కాంగ్రెసోళ్లను గ్రామ పొలిమేరల వరకు తరిమి కొట్టాలని తెలిపారు.
నిజామాబాద్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. 2023 డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని, ఇప్పటికీ 20 లక్షల పైచిలుకు రైతులకు రుణమాఫీ కాలేదని మండిపడ్డారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తమన్న మాట మార్చి 26 జనవరికి అని ఇప్పుడు మార్చి 31 అంటున్నారని ఎద్దేవాచేశారు. కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎవరికిచ్చారో చెప్పాలని ఊరూరా చెల్లెమ్మలు కాంగ్రెస్ మోసగాళ్లను ప్రశ్నించాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మోసాన్ని ఎండగట్టాలని విజ్ఞప్తి చేశారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చిన 420 రోజుల్లో 100 మందికి పైగా ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని, గురుకులాల్లో కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారని, 30 మందికి పైగా చేనేతలు, 500 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
పోలీసు శాఖ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా మారిందని విమర్శించారు. అందరి జాతకాలు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని, వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు వడ్డీ సహా చెల్లిస్తామని చెప్పారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి వినయ్‌రెడ్డి కుమ్మక్కై దోచుకుతింటున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీసీల గొంతు కోసిందని , వెనుకబడిన వర్గాలకు ద్రోహం చేస్తూ కాంగ్రెస్ నిజస్వరూపం బయట పెట్టుకున్నదని చెప్పారు. 30 లక్షల మేర బీసీ జనాభాను తక్కువ చేసి చూపారన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌ను స్థానిక ఎన్నికల్లో నిలదీయాలని, కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌కు కామాను చెరిపేసి ఫుల్‌స్టాఫ్ ఎందుకు పెట్టారో బీసీలు ప్రశ్నించాలని సూచించారు. తమిళనాడుకు భక్తవత్సలం, పశ్చిమబెంగాల్‌కు సిద్ధార్థ శంకర్ రే లాగే రేవంత్‌రెడ్డి కూడా రాష్ట్ర చివరి కాంగ్రెస్ సీఎంగా చరిత్రలో నిలిచిపోతాడని వ్యాఖ్యానించారు.