కామారెడ్డి, ఆగస్టు 18: రుణమాఫీని పూర్తిగా అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ డిమాండ్ చేశారు. ఏ గ్రామానికి వెళ్లినా 30 నుంచి 40 శాతం మంది రైతులకు మించి రుణమాఫీ కాలేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం మీడియా తో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.
ఓట్ల కోసం దేవుళ్లందరిపై ఒట్టేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. అధికారం వచ్చాక ఆ ఒట్లనే మరిచారని ధ్వజమెత్తారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కార్యాలయంపైకి గూండాలను పంపి దాడులు చేయించారని, దానికి పోలీసులు వత్తాసు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని ఆరోపించారు. దేశంలో అతి తక్కువకాలంలోనే సీఎం దిష్టిబొమ్మను దహనం చేసేస్థాయికి దిగజారిన ఏకైక వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.
రుణమాఫీపై 60వేల ఫిర్యాదులు
హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): రుణమాఫీపై రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రుణమాఫీ కాలేదని ఇప్పటివరకు ఏకంగా 60వేల ఫిర్యాదులు వచ్చినట్టుగా తెలిసింది. ఇవి కేవలం హెల్ప్‌లైన్ డెస్క్‌ల వద్ద వచ్చిన ఫిర్యాదులే కావడం గమనార్హం. ఇంకా ఏఈవోలు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల వద్ద వచ్చిన ఫిర్యాదులు అంతకుమించి ఉన్నట్టు తెలిసింది. సర్కారు అడ్డగోలు కోతలకు తోడు చిన్న చిన్న కారణాలు, సాంకేతిక సమస్యలతోనూ అర్హులైన రైతులకు రుణమాఫీ కావడం లేదు. ఆధార్‌లో అక్షరం తప్పుందని, పేరు సరిగ్గా లేదని, రేషన్‌కార్డు లేదని ఇలా అనేక కారణాలతో చాలామంది అర్హులు రుణమాఫీకి దూరమయ్యారు. ఈ రైతులంతా అధికారుల వద్దకు పరుగులు తీసి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవి ఎంత వరకు పరిష్కారమవుతాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.
వజ్జపల్లితండాలో సీఎం దిష్టిబొమ్మ దహనం
రామారెడ్డి, ఆగస్టు 18: సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో అబద్ధపు హామీలిచ్చి రైతులను మోసం చేశారని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లితండా గిరిజన రైతు లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీ చేయనందుకు నిరసనగా తండా రైతులు గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఆదివారం ఉదయం సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. గ్రామంలో చాలామందికి రుణమాఫీ కాలేదని, రేవంత్‌రెడ్డి.. సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అర్హులందరికీ రుణమాఫీ చేయకపోతే బ్యాంకులు, వ్యవసా య కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు.