కల్వకుర్తి, నవంబర్ 23 : కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ దవాఖాన మార్చురీలో ఉన్న సాయిరెడ్డి భౌతికకాయంపై పూలమాల ఉంచి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ సాయిరెడ్డిని వేధింపులకు గురిచేయడం.. ప్రాణాలు తీసుకునే వరకు ఇబ్బందుల పాలు చేయడం సరికాదని అన్నారు. ఆత్మక్షోభకు గురైన ఆయన అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. సాయిరెడ్డి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.