భువనగిరి అర్బన్, జనవరి 13 : బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి హెచ్చరించారు. భువనగిరిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలపైగానీ, ప్రతిపక్షనాయకులపై గానీ పోలీసులు అత్యుత్సాహం చూపించలేదని గుర్తుచేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భూ దందా, కబ్జాలే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని ఖండిస్తూ నిరసన తెలిపేందుకు వస్తుంటే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్ నిర్భంద కాండ సాగిస్తే ప్రతి చర్యలు తప్పవని హెచ్చరించారు. బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ ఇన్చార్జి క్యామ మల్లేశ్, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవు ; బీఆర్ఎస్ నేత కరాటే రాజునాయక్ ఆగ్రహం
హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): గిరిజనుల అభివృద్ధి ప్రదాత కేసీఆర్‌ను విమర్శించే హకు సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎంపీ రవీందర్‌నాయక్‌కు లేదని బీఆర్ఎస్ నాయకుడు కరాటే రాజునాయక్ మండిపడ్డారు. కేసీఆర్ అవకాశం ఇవ్వకుంటే రవీందర్‌నాయక్ వార్డ్ మెంబర్‌గా కూడా గెలిచేవాడు కాదని విమర్శించారు. రేవంత్‌రెడ్డికి వత్తాసు పలుకుతూ కేసీఆర్‌పై రవీందర్‌నాయక్ విమర్శలు చేయడం దారుణమని, పూటకో పార్టీ మారుస్తున్న రవీందర్‌నాయక్‌ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను విమర్శిస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. తండాలను గ్రామపంచాయతీలుగా మార్చడం, సేవాలాల్ జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం, బంజారాభవన్ నిర్మాణం, గిరిజన గురుకులాలు ఏర్పాటు, పొడుభూములకు పట్టాల పం పిణీ కేసీఆర్ వల్లే సాధ్యమయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం లగచర్లలో గిరిజనుల భూములు లాక్కుంటున్నప్పుడు రవీందర్‌నాయక్ ఎక్కడున్నాడని రాజునాయక్ ప్రశ్నించారు.