కృష్ణకాలనీ, జనవరి 5 : ‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం.. చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్లో ఎకరానికి రూ.15 వేలు ఇస్తానని మోసం చేసింది’ అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని విమర్శించారు. రైతులు ఆగ్రహంతో ఉన్నారని గ్రహించి.. గత్యంతరం లేక ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా ఇస్తామని ప్రకటించినట్టు తెలిపారు. ఎన్నికల సమయంలో రూ.15 వేలు ప్రకటించి ఏడాది తరువాత రూ.12 వేలు ఇస్తామనడంపై ఆయన భగ్గుమన్నారు. రేవంత్రెడ్డి చెప్పిన రకంగా చూస్తే ప్రభుత్వం రైతుకు ఎకరాకు రూ.17,500 రైతుభరోసా కింద బాకీ పడిందని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ కూడా కొద్దిమందికే జరిగిందని పేర్కొన్నారు. రైతుభరోసా, పూర్తిస్థాయిలో రుణమాఫీ, సన్న, దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్, వృద్ధులకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, మహిళలకు రూ. 2,500, రూ.500కే గ్యాస్, నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి తులం బంగారం పథకాలను ఎప్పుడు ఇస్తారో ప్రకటించి, కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు.