హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రజలు ప్రశ్నిస్తరు.. బరాబర్ ప్రశ్నిస్తరు.. ప్రశ్నిస్తే తప్పేంటి?’ అని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నిలదీశారు. ‘ఎన్నికల ముందు కాంగ్రెస్ హా మీలు ఇచ్చింది నిజం కాదా? అమలుచేయకపోవడం వాస్తవం కాదా?’ అని ప్రశ్నించారు. రైతులకు ఎకరాకు రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఎప్పటిలోగా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పార్టీ నేతలు వాసుదేవరెడ్డి, వై సతీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్కు తెలంగాణతోపాటు దేశ,విదేశాల్లో అభిమానులు ఉన్నారని, వారు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే ఎం దుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. తక్కువ సమయంలో ప్రభుత్వంపై ఇంత ప్రజావ్యతిరేకత ఎన్నడూ చూడలేదని, పాలన ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరుగనివ్వరని చెప్పారు. రుణమాఫీ, రైతు భరోసా, పంటలకు రూ. 500 బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు రేవంత్‌రెడ్డి ఆశ కల్పించారని, ఇప్పుడు సన్నవడ్లకే బోనస్ ఇస్తామని మోసం చేశారని మం డిపడ్డారు. దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పత్తికి మద్దతు ధర అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీసీఐ కేంద్రాలతో మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.