హైదరాబాద్, జూలై 10 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ కుంటిసాకులు మాని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్ల ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని, లేదంటే తెలంగాణ రైతాంగం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. కేసీఆర్‌పై కక్షతోనే మేడిగడ్డ పిల్లర్ల మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. మరమ్మతులకు ఎల్అండ్టీ ముందుకొచ్చినా రెండున్నరేండ్లుగా అడ్డుకొంటున్నదని ఆరోపించారు. ఎల్ నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా కరువు ఛాయలు కనిపిస్తున్న తరుణంలో ప్రతి నీటి బొట్టునూ ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం.. నిర్లిప్తంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వానల్లేక రైతాంగం అల్లాడుతుంటే చేతగాని సీఎం రేవంత్‌రెడ్డి కన్నెపల్లి పంప్‌హౌస్ మోటర్లను ఆన్ చేయకుండా వారికి అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. రిటైర్డ్ ఇంజినీర్లు, నీటి పారుదలరంగం నిపుణుల సూచనలను పెడచెవిన పెట్టడం దుర్మార్గమని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అన్నదాతల గోసపట్టడమే లేదని విమర్శించారు. తెలంగాణ కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు.
పరిజ్ఞానం లేని రేవంత్‌రెడ్డి
పంటల సాగు విషయంలో సీఎం రేవంత్‌రెడ్డికి రైతులకుండే కనీస పరిజ్ఞానం కూడా లేదని గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఈ రెండున్నరేండ్ల తన పాలనాకాలంలో ఇచ్చిన హామీలను ఎగ్గొడుతూ కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకొన్నారని దెప్పిపొడిచారు. రేవంత్‌రెడ్డి అనాలోచిత నిర్ణయంతో దేవాదుల కింద పంటపొలాలు ఎండిపోయాయని, జూన్‌లోనే దేవాదుల పంపులను ఆన్‌చేసి నీరందిస్తే రైతులకు ఎంతోమేలు జరిగేదని పేర్కొన్నారు. ‘మాజీ ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం ఉన్నది. అందుకే అధికారంలో ఉన్న ఆ పార్టీని వదిలి ప్రతిపక్ష బీఆర్ఎస్ను ఆమె టార్గెట్ చేస్తున్నారు’ అని ఆరోపించారు. దేశంలోని అన్ని పార్టీలు వివిధ రూపాల్లో నిధులను సమీకరించుకొంటాయని, అదే తరహాలో బీఆర్ఎస్ సైతం నిధులు సమీకరించుకొంటున్నదని, దీనిలో వింతేమున్నదని ప్రశ్నించారు.