తిరుమలగిరి, జూలై 12 : ‘ఖబర్దార్ రేవంత్‌రెడ్డి.. ముందు కాళేశ్వరం జలాలు ఇచ్చినంకనే తుంగతుర్తిలో అడుగుపెట్టు.. నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నరు. నీకు రైతుల గోడు విన్పిస్తలేదా? బిడ్డా రేవంత్‌రెడ్డి.. తుంగతుర్తి చైతన్యవంతమైన గడ్డ.. నీకు గుణపాఠం చెప్తరు’ అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ హెచ్చరించారు. శనివారం ఆయన నల్లగొండ జిల్లా తిరుమలగిరిలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో తుంగతుర్తికి వచ్చి ఫేక్ బాండ్లు, చేతకాని హామీలు ఇచ్చి ఇక్కడి ప్రజలను మోసం చేసినట్టు విమర్శించారు.
ఈనెల 14న ఇక్కడ అడుగుపెట్టే అర్హత ముఖ్యమంత్రికి లేదని అన్నారు. సవాల్ విసురుడు రేవంత్‌కు అలవాటేనని పేర్కొన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ను పబ్ అని దుర్మార్గంగా మాట్లాడి జర్నలిస్టుల మనోభావాలను కించపరిచినట్టు దుయ్యబట్టారు. ‘పొద్దున లేస్తే రైతు సంక్షేమం అంటుండు. దమ్మంటే రా.. చర్చిద్దాం. రైతులు ఎక్కడ సంతోషంగా ఉన్నారో చూద్దాం. మంత్రి ఉత్తమ్‌కుమార్ సొంత ఊరిలో కూడా రుణమాఫీ కాలేదు. ఎక్కడైనా చర్చకు రెడీ.. దమ్ముంటే రా’ అని రేవంత్‌రెడ్డికి సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రెస్ క్లబ్‌కు వస్తే.. రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పారిపోయిండని ఎద్దేవా చేశారు.
నీటిరంగంపై సీఎం, మంత్రులకు అవగాహనే లేదని విమర్శించారు. గోదావరి జలాలను బనకచర్లకు తరలిస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లు తీసుకొచ్చి పంటలకిస్తే.. రేవంత్ సర్కార్ పొలాలను ఎండబెట్టిందని ఆరోపించారు. ఇప్పటికైనా కన్నెపల్లి పంప్‌లు ఆన్‌చేస్తే పుష్కలంగా సాగు నీళ్లు అందుతాయని తెలిపారు. 42 శాతం రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేస్తున్నట్టు విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యేకు స్వలాభాపేక్ష తప్ప మరో సోయి లేదని ఆరోపించారు. ఆయన దళిత ద్రోహి అని, దళితబంధు నిధులు లబ్ధిదారులకు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని ఆరోపించారు.