హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసిన సొమ్మును మహారాష్ట్ర ఎన్నికల ఖర్చు కోసం పంపాలనే అజెండాను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అమలు చేసినట్టు తెలుస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ ఆరోపించారు. పేదలపై బుల్డోజర్ రాజకీయం చేస్తున్నారని, పెద్దల ఇండ్ల విషయానికి వచ్చే సరికి సైలెంట్ అయిందని ఎద్దేవాచేశారు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేకతను హైడ్రాతో రేవంత్‌రెడ్డి కప్పిపుచ్చుతున్నారని, ఆరు గ్యారెంటీల ముచ్చట లేకుండా చేస్తున్నారని విమర్శించారు. సినీనటుడు మురళీ మోహన్, రేవంత్‌రెడ్డి సోదరుడి నిర్మాణాలను నోటీసులు మాత్రమే ఇచ్చి, సమయం ఇవ్వకుండా పేదల ఇండ్లను మాత్రం కూల్చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదివారం సాయంత్రానికల్లా నివాసం ఉండే వారి ఇండ్లను కూలగొట్టబోమని చెప్తున్నారని, పెద్దల ఇండ్లను కూల్చబోమని ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్‌నోట్‌లో ఉన్నదని పేర్కొన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన డైరెక్షన్ మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారించాలని, హెచ్ఎండీఏ పరిధిలో 2,569 చెరువులకు ఎఫ్టీఎల్ నిర్ధారించాలని హైకోర్టు ఆదేశిస్తే.. ఇప్పటి వరకు 264 చెరువులకే ఎఫ్టీఎల్ను నిర్ధారించారని తెలిపారు. నిర్ధారణ కాకుండా నిర్మాణాలు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని ఎలా చెప్తారని ప్రశ్నించారు. హైడ్రా చర్యలు కోర్టు ధికరణ కిందకు వస్తాయని సీఎం, హైడ్రా కమిషనర్‌పై కోర్టు ధిక్కరణ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో పేదల ఇండ్లు ఉంటే వాటిని తొలగించడంతో పాటు పునరావాసం కల్పించాలని హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. రాజకీయ కక్ష సాధింపులకు హైడ్రాను వాడుకుంటున్నారని ఆరోపించారు. ఫైళ్లు ఎవరికి పంపాలో సీఎంకు తెలియడం లేదని ఎద్దేవా చేశారు.
విద్యార్థుల డిమాండ్లు నెరవేర్చాలి : గెల్లు
వారం నుంచి బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ధర్నా చేశారని, వారి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి గోడ దూకి బాసర ఐఐటీకి వెళ్లారని, అధికారంలోకి వస్తే నాలుగు త్రిపుల్ ఐటీలు పెడతామని చెప్పారని, ఇప్పుడు ఉన్న బాసర త్రిపుల్ ఐటీ గురించే పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి బాసర ఐఐఐటీని సందర్శించారని, విద్యార్థులకు మినీ స్టేడియం కోసం మూడు కోట్లు కేటాయించారని, కాంగ్రెస్ వచ్చాక దాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకుడు పల్లా ప్రవీణ్‌రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి యాదవ్, పడాల సతీశ్, నేవూరి ధర్మేందర్‌రెడ్డి, నూకల యుగేందర్‌రెడ్డి, జహీర్‌ఖాన్ పాల్గొన్నారు.