హైదరాబాద్, మే 3 (నమస్తేతెలంగాణ): ‘రైతుల భూములు గుంజుకొని వెంచర్లు వేసి అవినీతికి పాల్పడుతున్న ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావును విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది? పొద్దున లేస్తే భూదందాలు నడిపే ఐలయ్య తెలంగాణ కోసం కోట్లాడిన ఉద్యమనేత హరీశ్‌రావుపై అభాండాలు వేయడం దుర్మార్గం’ అని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ నిప్పులు చెరిగారు.
హరీశ్‌రావుపై బీర్ల ఐలయ్య చేసిన విమర్శలపై ఆదివారం ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. ఆలేరులో ఐలయ్య అవినీతి వ్యవహారాల గురించి ఎవరిని అడిగినా చెప్తారని, ఐలయ్య బాధితుల సంఘాలు ఏర్పడ్డాయంటేనే ఆయన అరాచకాలు ఏమిటో అర్థమవుతున్నాయని పేర్కొన్నారు. ఐలయ్య మతిస్థిమితం కోల్పోయి అడ్డంపొడుగు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రేవంత్ పాలనలో
కేసీఆర్ హయాంలో వేళకు రైతుబంధు అందడం, సజావుగా పంటల కొనుగోలు చేయడంతో దర్జాగా బతికిన రైతన్నలు.. కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని గాదరి కిశోర్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రికి సోయిలేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్న రైతులు, దిక్కుతోచని స్థితిలో రోడ్డెక్కి ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్ సర్కార్‌కు చీమకుట్టినట్టయినా లేకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. కాంగ్రెస్ గద్దెనెక్కినప్పటి నుంచి రైతులను యూరియా కోసం క్యూలో నిలబెడుతున్నారని ఆరోపించారు. హరీశ్‌రావు నిలదీస్తేగానీ సర్కార్ కండ్లు తెరువలేదని తెలిపారు.
అవినీతి కూపంలో కూరుకుపోయిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫ్రస్ట్రేషన్లో బీఆర్ఎస్ నేత హరీశ్‌రావుపై బజారు రౌడీలాగా మాట్లాడారని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ ఒక ప్రకటనలో విమర్శించారు. భూదందాలు చేసే ఐలయ్యకు హరీశ్‌రావు గురించి మాట్లాడే నైతికహక్కు ఎక్కడిదని నిలదీశారు. ఉద్యమనేత హరీశావుపై నోరు పారేసుకోవడం అంటే సూర్యుడిపై ఉమ్మేసిన చందమేనని మండిపడ్డారు.