ఖలీల్‌వాడి, జూన్ 30: చట్టబద్ధతలేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు జరిపి మరోసారి రైతులను మోసగించిన ఘనత కేంద్రంలోని బీజేపీ సర్కార్కే దక్కిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో విమర్శించారు. పసుపుబోర్డు నేమ్‌ప్లేట్ నిజామాబాద్‌లో, ఆఫీస్ కార్యకలాపాలు ఢిల్లీలో నిర్వహిస్తుంటే ఇక్కడి పసుపు రైతులకు ఒరిగేదేమిటని ప్రశ్నించారు. ఐదు రోజుల్లోనే పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మరీ రైతులను మభ్యపెట్టిన ఎంపీ అర్వింద్.. పదేండ్ల తర్వాతనైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని సూచించారు.
గత ఎన్నికల సమయంలో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా నిజామాబాద్ గడ్డ మీద ప్రకటించారని, ఏడాది గడిచాక కూడా బోర్డు స్థాపన జరగలేదని, దీంతో పసుపు రైతుల్లో అసంతృప్తి చెలరేగుతున్న వేళ హడావుడిగా జనవరి 14న పసుపుబోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వర్చువల్‌గా ప్రారంభించినట్టు తెలిపారు. ఇప్పుడదే కార్యాలయాన్ని కేంద్ర మంత్రి అమిత్‌షా మరోసారి ప్రారంభించి నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. ఒక బోర్డుకు ఎన్నిసార్లు ప్రారంభోత్సవాలు చేస్తారని ప్రశ్నించారు. పదేండ్లలో కేసీఆర్ ఏం చేశారని పదేపదే ప్రశ్నిస్తున్న బీజేపీ నాయకులకు.. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన భవనమే పసుపుబోర్డుకు దిక్కవడమే దీటైన సమాధానమని తెలిపారు. పసుపు పంటకు రూ.15 వేల మద్దతు ధర కల్పించడంపై అమిత్‌షా నోరుమెదపకపోవడం రైతులను మోసగించడంగాక మరేమిటని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.