నార్కట్పల్లి, నవంబర్ 4 : ‘కేసీఆర్ సర్కారే బాగుండే.. కాంగ్రెస్ సర్కార్ వచ్చినంక రైతులకు అన్నీ సమస్యలే.. ఎరక్కపోయి ఇరుక్కుపోయినట్లుంది’ అని పలువురు రైతులు వాపోయారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పరిశీలించేందుకు వెళ్లిన నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో పలువురు రైతులతో ముచ్చటించారు. రూ.2 లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా? అని రైతులను ఆయన అడిగి తెలుసుకున్నారు. చాలామంది రుణమాఫీ కాలేదని చెప్పారు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండేదయ్యా.. అన్ని పథకాలు టైముకు వస్తుండే అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెసోళ్లు పంట పెట్టుబడి పైసలివ్వలేదని, ఇప్పుడు కూడా ఇయ్యమంటున్నారని తెలిపారు. ఈ సారి ఇంత వానలు కురవకపోతే నిండా మునిగేటోళ్లమని చెప్పారు. కాంగ్రెస్ సర్కారు రైతులకు ఒరగబెట్టింది ఏమీలేదని, కేసీఆర్ సారే మళ్లీ రావాలని అన్నారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య స్పందించి ధైర్యంగా ఉండాలని, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.