హైదరాబాద్, నవంబర్ 4( నమస్తే తెలంగాణ): అధికారంలోకి రాగానే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. మాజీ సర్పంచులకు చెల్లించడంలో జాప్యమెందుకని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌తో కలసి క్రాంతికిరణ్ మీడియాతో మాట్లాడారు. న్యాయం కోసం పోరాడుతున్న మాజీ సర్పంచ్ల అరెస్ట్ అక్రమమని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలుతున్నదని, బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన పనులకు ప్రస్తుతం అధికార పార్టీ నేతలు అంచనాలు పెంచుతున్నారని విమర్శించారు.
కాంట్రాక్టర్ల నుంచి కమీషన్ల కోసమే అక్రమాలకు పాల్పడుతున్నారని మండిప్డడారు. ఆంధోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ కనుసన్నల్లో అవినీతి పెచ్చరిల్లుతున్నదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో రోడ్ల నిర్మాణానికి 54 లక్షలు మంజూరు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం టెండర్లను రద్దు చేసి వంద శాతం అంచనాలు పెంచి, అవినీతి పర్వానికి తెరతీసిందని ఆరోపించారు. మంత్రి బావమరిది కాంట్రాక్టర్ అవతారమెత్తి దోపిడీకి పాల్పడుతున్నాడని క్రాంతికిరణ్ విమర్శించారు. ఆంధోల్‌లో సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను అటకెక్కించారని ఆగ్రహంవ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది కావొస్తున్నా జాబ్ క్యాలెండర్ జాడ లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్ విమర్శించారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఉద్యోగాలు ఇవ్వాలని అడిగినందుకు నిరుద్యోగులపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో 163 సెక్షన్ పెట్టి ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ నాయకుల చెప్తున్న మాటలు నమ్మబోమని గెల్లు శ్రీనివాస్‌యాదవ్ తేల్చిచెప్పారు.