Kollapur | కొల్లాపూర్ రూరల్, మే 1: ‘అసెంబ్లీ ఎన్నిలకు ముందు కాంగ్రెస్ నేతలు చెప్పిన మాయమాటలు విని వారికి ఓటేసి గెలిపిస్తే మమ్మల్ని ఆగం చేసిండ్రు.. ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ఇప్పుడు గోసపడుతున్నం.. ఎంపీ ఎన్నికలు వస్తుండటంతో మళ్లా ఆ పార్టోళ్లు అసత్య ప్రచారాలు.. మాయమాటలు చెప్పేందుకు వస్తున్నరు. మరోసారి వారి మాటలకు మోసపోం.. మాకు బుద్ధి వచ్చింది.. మా గుండెల్లో కేసీఆర్ సారే ఉన్నడు’ అని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డితో ఉపాధి హామీ కూలీలు కాంగ్రెస్‌పై ఉన్న అక్కసును వెళ్లగక్కారు.
బుధవారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అంజనగిరికి ఎన్నికల ప్రచారానికి వెళ్లి వస్తుండగా.. ఎల్లూరు శివారులో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు కనిపించారు. వెంటనే కారు దిగిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి వారి వద్దకు వెళ్లి పలుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇంత మోసం చేసిన కాంగ్రెస్ లీడర్లు మళ్లీ తమ ఇండ్ల వద్దకు ఓట్ల కోసం వచ్చినా ఆ పార్టీకి ఓట్లేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తామని, ప్రవీణ్ సారును గెలిపించుకుంటామని వెల్లడించారు. ఈ సందర్భంగా బీరం మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రజా సేవ కోసం ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారని, కారు గుర్తుకు ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.