హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ రాష్ర్టాన్ని సగవెడితే.. కాంగ్రెస్ ఎగవెట్టుడు.. రాష్ర్టాన్ని పండవెట్టుడు తప్ప చేసిందేమీలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) విమర్శించారు.‘కేసీఆర్ కరెంట్‌ను సగవెట్టిండు. మంచినీళ్లు సగవెట్టిండు. పల్లెటూర్లు.. పట్టణాలను సగవెట్టిండు. రేవంత్‌రెడ్డి ఏమో అన్నీ ఎగవెట్టుడు. ఎండవెట్టుడు. రాష్ర్ర్టాన్ని పండవెట్టుడు తప్ప ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. ఈ రెండేండ్లలో కాంగ్రెస్ సర్కార్ తెలంగాణకు తీరని నష్టం చేకూర్చిందని నిప్పులు చెరిగారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హైదరాబాద్ తెలంగాణ భవన్లో బుధవారం తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పిన కేటీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఓపికలేని.. తెలివిలేని సీఎం రాష్ర్టాన్ని నడుపుతున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయనకు పాలన చేతకావడమే లేదని వ్యాఖ్యానించారు. ‘సీఎం కథ చూస్తే ముఖం బాగలేక ఎనకట ఎవరో అద్దం పగులగొట్టినట్టున్నది’ అని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు అడ్డమైన అబద్ధాలు చెప్పి గద్దెక్కి ఇప్పుడు నడుప చాతనైతలేదు అని అంటున్నారని మండిపడ్డారు. తెల్తారి లేస్తే కేసీఆర్‌ను తిట్టుడు తప్ప ఇంకోటిలేదని వాగ్బాణాలు సంధించారు. ‘మేము రెండువేల రైతుబంధు ఏమైంది? అని అంటే లాగుల తొండలిడుస్తా! రెండున్నర వేలు ఇస్తానంటివి ఏం సంగతి అంటే నీ పేగులు మెడలేసుకుంటా! తులం బంగారం ఏమైంది? అని గట్టిగ అడిగితే గుడ్లు పీకి గోటీలాడుకుంట! ఇట్లా బెదిరించుడు.. పచ్చి అబద్ధాలపై పరిపాలన చేయడం అలవాటు చేసుకున్నారు’ అని విమర్శించారు.
మీకే స్పష్టత లేకపోతే ఎట్లా?
పాలన చేతగాక అప్పుల పేరుతో రేవంత్‌రెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. ‘కేసీఆర్ రాష్ర్టాన్ని అప్పుల పాలు చేసిండని కాంగ్రెసోల్లు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒకటే బాకా ఊదుతున్నరు. ఒక మంత్రేమో ఆరు లక్షల కోట్లు.. అంటరు. మరో మంత్రి ఏడు లక్షల కోట్ల అప్పు అంటరు. ముఖ్యమంత్రి ఏమో ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసిండు అని అంటడు. పరిపాలిస్తున్న మీకే స్పష్టత లేకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పులపై ఓ బీజేపీ ఎంపీ పార్లమెంట్లో అడిగితే కేసీఆర్ గద్దెనెక్కిననాడు 2 జూన్ 2014న రూ. 72 వేల కోట్ల అప్పు ఉంటే. కేసీఆర్ గద్దె దిగిననాడు (3 డిసెంబర్ 2023న) మూడు లక్షల యాభైవేల కోట్ల అప్పు మాత్రమేనని కేంద్రం స్పష్టంచేసిందని వివరించారు. దీంట్లో వారసత్వంగా వచ్చిన పాత అప్పు 72 వేల కోట్లు తీసేస్తే.. పదేండ్లల్లో కేసీఆర్ చేసిన అప్పు రూ. 2.80 లక్షల కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పారు.
అప్పులు చేసినం.. సగవెట్టినం..
తాము అప్పులు చేసి.. ఆగమైన తెలంగాణను గాడిన పెట్టామని, అన్నీ సగవెట్టినమని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ‘కాంగ్రెసోళ్లు ఇచ్చిన అర్ధరాత్రి వచ్చే దొంగ కరెంట్ స్థానంలో.. 24 గంటల కరెంట్ కోసం రూ.50 వేలకోట్లు ఖర్చుచేసినం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం రూ.93 వేల కోట్లు ఖర్చుచేసినం. వరిధాన్యం ఉత్పత్తిలో రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్ చేసినం. స్వాతంత్య్రం వచ్చాక ఏ నాయకుడు ఇవ్వనట్టు రైతులు అడగక ముందే 11 సీజన్లు.. రూ.73 వేల కోట్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసినం. నలభై వేల కోట్లు పెట్టి ఇంటింటికీ నల్లాలు పెట్టి నీళ్లిచ్చినం. రాష్ట్రంలో ఐదు మెడికల్ కాలేజీలుంటే.. 33 జిల్లాలు చేసి, 33 మెడికల్, 33 నర్సింగ్ కాలేజీలు పెట్టాం’ అని పేర్కొన్నారు
పొద్దున పోయి సాయంత్రం ఇంటికొచ్చినట్టుంది..
అరూరి రమేశ్ బీఆర్ఎస్లో చేరడమంటే పొద్దున తప్పిపోయిన పిలగాడు సాయంత్రం ఇంటికి వచ్చినట్టుగా ఉన్నదని చెప్పారు. ‘2018లో అరూరి రమేశ్‌కు 99,969 ఓట్ల మెజారిటీ వచ్చింది. 31 ఓట్లు వస్తే లక్ష మెజారిటీ వచ్చేది. ఈ సారి లక్ష మెజారిటీ వస్తదనుకున్నం. కానీ దిష్టి తగలడంతో దురదృష్టవశాత్తు 16 వేల తేడాతో ఓడిపోయారు’ అని చెప్పారు. క్యాడర్లో కొత్త, పాత అని చూడొద్దు.. తేడా చూపరాదని కోరా రు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలే కాకుండా రాబోయే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. వరంగల్ జిల్లాలో 12కు పన్నెండు మున్సిపాలిటీలు గెలువాలని.. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ వైపే జనం చూపు: హరీశ్‌రావు
‘రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అన్నిరంగాల్లో ఆగమైంది.. అన్నివర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారు.. ఈ దశలో జనమంతా కేసీఆర్ వైపే చూస్తున్నారు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఆరూరి రమేశ్ బీఆర్ఎస్లో చేరిక సందర్భంగా ఏర్పాటైన సభలో హరీశ్‌రావు మాట్లాడారు. కేసీఆర్‌ను వద్దనుకొని.. ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని తెలిపారు. అరూరి చేరిక కూడా అందు కు నిదర్శనమని చెప్పారు. తిరిగి సొంతగూటికి చేరిన నాయకులు, కార్యకర్తల ముఖంలో చిరునవ్వులు, వెలుగులు చూస్తుంటే.. బరువెక్కిన గుండె తేలికైనట్టు.. మా ఇంటికి మేమొచ్చినం అన్నట్టు కనిపిస్తున్నదని చెప్పారు. యావత్తు తెలంగాణ రాష్ట్రం కూడా కేసీఆర్ వైపు చూస్తున్నదన్నారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం, ఒక భరోసా, భద్రత అని హరీశ్‌రావు కొనియాడారు. కానీ, ఈ రెండేండ్లలో ఆ భరోసా, ఆ భద్రత కొరవడిందని చెప్పారు. కేసీఆర్ ఉండగా ఏనా డూ ఎరువుల కొరత ఉండకపోయేదని, ఇప్పడు నిత్యం వెతుకులాటతో రైతులు వెతలు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు రాష్ట్రమంతా ఆగమాగం అయిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే రాష్ట్రం కేసీఆర్ వైపు చూస్తున్నదని చెప్పారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాబోదని, బీజేపీకి స్థానమే లేదని తేల్చి చెప్పారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వాన్ని తెచ్చుకునేందుకు ఐకమత్యంగా కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెబుదాం: జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
అందరం ఐక్యంగా ఉండి ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్దామని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్సేనని ఆయన ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లోకి రావడానికి గతంలో వీడిన నాయకులంతా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అందులో భాగంగానే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ వచ్చారని తెలిపారు. నాయకులంతా కలిసికట్టుగా, ఒక కుటుంబ సభ్యులుగా బీఆర్ఎస్ను అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేయాలని కోరారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్‌ను ఇంటికి సాగనంపి, కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేయడానికి తెలంగాణ ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
కాంగ్రెస్.. ఇక రోజులు లెక్క పెట్టుకో: సత్యవతి
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఇక నుంచి రోజులు లెక్క పెట్టుకోవాల్సిందేనని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయని, గతంలో పార్టీని వీడిన నాయకులంతా తిరిగి పార్టీలోకి రావడం శుభపరిణామమని పేర్కొన్నారు. ఆరూరి రమేశ్‌తో పాటు పాత నేతలు తిరిగి బీఆర్ఎస్లోకి రావడం మొదలైందని చెప్పారు. పుట్టింటిపై అలిగి అత్తగారింటికి పోయి, తిరిగి పుట్టింటికే వచ్చారని పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమైపోయిందని స్పష్టంచేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి ఒక కుటుంబసభ్యుల్లాగా అందరం కలిసి పోరాడుదామని కోరారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమైపోయిందని స్పష్టం చేశారు.
అరూరి రాక పార్టీకి లాభం : ఎర్రబెల్లి
అరూరు రమేశ్ చేరిక బీఆర్ఎస్కు లాభమేనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. ఆరూరి పార్టీలోనే ఉంటే పంచాయతీ ఎన్నికల్లో ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకునే వాళ్లమని చెప్పారు. ఇక అందరినీ కలుపుకొని పోదామని తెలిపారు. కష్టకాలంలో ఉన్నవాళ్లను కాపాడుకుంటూ, వీళ్లను కూడా కాపాడుకోవాలని ఈ సందర్భంగా ఆయన కేటీఆర్, హరీశ్‌రావుకు విజ్ఞప్తి చేశారు. కడియం శ్రీహరి వల్లే అరూరి పార్టీని వీడారని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల గెలుపే ధ్యేయంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి కూడా, అరూరి రమేశ్‌కు ప్రాధాన్యం ఇచ్చినా, అయన కేసీఆర్‌పై ఉన్న అభిమానంతోనే తిరిగి సొంత గూటికి వచ్చినట్టు పేర్కొన్నారు. సర్వేలన్నీ కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. వరంగల్‌లో 12 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం మనకే ఎక్కువగా ఉన్నదని తేల్చి చెప్పారు.
మున్సిపల్ గెలుపే బహుమానం: పోచంపల్లి
వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ స్థానాలు గెలిచి కేసీఆర్‌కు బహుమానంగా ఇద్దామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో తమ నాయకులకు అండగా ఉంటానని తెలిపారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి, కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసే దాకా నిద్రపోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదే ఉత్సాహంతో పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
విధిలేని పరిస్థితిలోనే పార్టీని వీడా: అరూరి
గత ఎన్నికల సమయంలో విధిలేని పరిస్థితిలోనే తాను బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చిందని, గత ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాల్సి వచ్చిందని పార్టీలో తిరిగి చేరిన వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ మనోగతం వ్యక్తంచేశారు. తాను పార్టీని వీడినా ఏనాడూ బీఆర్ఎస్ను కానీ, పార్టీ నేతలను కానీ ఏ ఒక్క మాట అనలేదని తెలిపారు. తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడం కోసం తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చానని స్పష్టంచేశారు. గత ఎన్నికల్లో ప్రస్తుత సీఎంతో ములాఖత్ పెట్టుకొని, ఒక నాయకుడు తన బిడ్డకోసం కుట్రలు చేశారని, అందువల్లే తాను బీఆర్ఎస్ను వీడాల్సి వచ్చేందే తప్ప వేరే ఉద్దేశం తనకు లేదని చెప్పారు. కానీ, ఇప్పుడు అలాంటి పాపాత్ములు బయటకు పోయినందునే తాను తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చానని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని అన్ని రంగాల్లో ఈ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను తన భుజాన వేసుకుని గెలిపించుకుంటానని అరూరి ప్రతినబూనారు.
కొత్త ఇటుక పేర్చలే.. కాలువ తవ్వలే..
రేవంత్‌రెడ్డి ఈ రెండేండ్లల్లో తెచ్చిన రెండున్నర లక్షల కోట్ల అప్పుతో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కార్యక్రమైనా చేపట్టారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘ఈ రెండేండ్లలోనే 2.50 లక్షల కోట్ల అప్పు చేసి ఒక కొత్త ఇటుక పేర్చిండా? ఒక కాలువైనా తవ్విండా? ఒక చెరువును మంచిగ చేసిండా? అంటూ ప్రశ్నించారు. రైతుబంధు రెండుసార్లు ఎగ్గొట్టిండు. వృద్ధులకు నాలుగువేలిస్తానన్నాడు. రెండు వేలు రెండు నెలలు ఎగ్గొట్టిండు. తులం బంగారమిస్తామని అది కూడా ఎగ్గొట్టిండు. కాంగ్రెసోళ్లు తులం బంగారం ఇచ్చేటోళ్లు కాదు.. మెడల ఉన్న పుస్తెలతాడు ఎత్తుకపోయే రకమని విమర్శించారు.
అరూరికే వర్ధన్నపేట నియోజకవర్గ బాధ్యతలు ; ప్రకటించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
వర్ధన్నపేట నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి బాధ్యతలను తిరిగి మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌కే అప్పగిస్తామని కేటీఆర్ ప్రకటించారు. రెండు పర్యాయాలు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి భారీ మెజార్టీతో గెలిచిన రమేశ్ రెండేండ్ల క్రితం బీజేపీలో చేరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ వరంగల్ అభ్యర్థిగా పోటీచేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన బీజేపీలో నామమాత్రంగానే వ్యవహరించారు. రమేశ్ బీఆర్ఎస్ను వీడినప్పటి నుంచి వర్ధన్నపేట నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అధిష్ఠానం ఎవరికీ అప్పగించలేదు. నియోజకవర్గ కార్యక్రమాలన్నీ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన భుజస్కంధాలపై వేసుకొని శ్రేణులను సమన్వయం చేశారు. తాజాగా బుధవారం తన అభిమానులు, పార్టీ శ్రేణులతో కలిసి అరూరి రమేశ్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరడంతో మళ్లీ బీఆర్ఎస్ నియోజకవర్గ బాధ్యతలు ఆయనకే అప్పగించాలని నిర్ణయించారు.
మోసగాళ్ల చేతిలో ఒకసారి కాదు..
రెండోసారి కూడా మోసపోతే తప్పు మనదేనని గుర్తుంచుకోవాలి. ఒకసారి మోసపోతే మోసం చేసినోళ్ల తప్పైతది. మోసగించినోళ్ల చేతిలోనే మళ్లీ మోసపోతే.. మళ్లీ మోసపు మాటలు నమ్మితే తప్పు మనదైతది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి.
-కేటీఆర్
తెలంగాణలో ఈ వర్గం.. ఆ వర్గం అని కాదు.. అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. తీవ్రమైన బాధలో ఉన్నారు. కానీ పట్టించుకునే నాథుడే లేడు. రాష్ర్టాన్ని పాలిస్తున్న కాంగ్రెస్‌కు తీరిక లేదు. దేశాన్ని నడుపుతున్న
బీజేపీకీ సోయిలేదు. -కేటీఆర్